Let's talk: editor@tmv.in
మత రాజకీయాలకు విరుద్ధం: అజిత్‌పవార్

మత రాజకీయాలకు విరుద్ధం: అజిత్‌పవార్

Pinjari Chand
14 జనవరి, 2026

బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు మతపరమైన కోణం ఇవ్వడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని, తనకు లౌకిక (సెక్యులర్) ఆలోచనా విధానం ఉందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్ స్పష్టం చేశారు. మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అజిత్ పవార్ మాట్లాడుతూ నాకు ఇలాంటి వ్యాఖ్యలు అసలు నచ్చవు. నాకు లౌకిక దృక్పథం ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలు మనకు ఇదే నేర్పించాయి. భారతదేశం చాలా విభిన్నమైన దేశం. ఇక్కడ నివసించే వారందరూ భారతీయులే అని చెప్పారు. అదే సమయంలో దేశద్రోహానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన శిక్షలు ఉండాలి. అవసరమైతే కొత్త చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికీ పని చేయడానికి, తమ సామర్థ్యాన్ని చూపించడానికి సమాన అవకాశాలు ఉండాలని రాజ్యాంగం చెబుతోందని అజిత్ పవార్ అన్నారు.

అజిత్ పవార్ వ్యాఖ్యలు, బీఎంసీ మేయర్ ‘మహాయుతి నుంచే, హిందువే, మరాఠీయుడే’ అవుతాడని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతిపక్షాలు ‘మరాఠీ మనుష్’కు ముప్పు ఉందని చేస్తున్న ఆరోపణలను ఫడ్నవీస్ తోసిపుచ్చారు. మరాఠీ ప్రజల ఉనికికి ముప్పు లేదు. కొన్ని రాజకీయ శక్తులే తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మహారాష్ట్ర ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని ఆయన అన్నారు. అలాగే బీఎంసీకి నాయకత్వం వహించేది మరాఠీయుడే అని మరోసారి స్పష్టం చేశారు.

పీసీఎంసీలో అవినీతి పెరిగింది

మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో, పింప్రి–చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ)లో భారీ అవినీతి జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరోసారి ఆరోపించారు. దేశంలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటైన పీసీఎంసీలో ప్రజలకు మౌలిక వసతులు అందకపోవడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు.

రూ.70 లక్షల రోడ్డుకు..రూ.7 కోట్లకు పెంచారు

పుణే జిల్లా గార్డియన్ మంత్రిగా కూడా ఉన్న అజిత్ పవార్ పీసీఎంసీ పరిధిలో ట్యాంకర్ మాఫియా ప్రజల జీవితాలను కష్టతరం చేస్తోందని తెలిపారు. ప్రజలకు సరైన నీటి కనెక్షన్లు ఇవ్వకుండా ట్యాంకర్ మాఫియా ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు కాలుష్యం, శుభ్రమైన రహదారులు, తాగునీటి సమస్యలపై తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పీసీఎంసీ వివిధ విభాగాలకు సంబంధించి సుమారు రూ.4,000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఖర్చులు అనవసరంగా పెంచిన అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. అందులో భాగంగా కేవలం రూ.70 లక్షలతో నిర్మించాల్సిన రహదారిని రూ.7 కోట్లకు పెంచడం, చెట్లు నరుకుతామంటూ రూ.7 కోట్లు ఖర్చు చూపించి ఒక్క చెట్టును కూడా తొలగించకపోవడం, మొదట రూ.12 కోట్లుగా అంచనా వేసిన సాఫ్ట్‌వేర్ వ్యయాన్ని రూ.120 కోట్లకు పెంచడం వంటి ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు.

ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి పీసీఎంసీలో జరిగిన అవకతవకలపై నేను వరుసగా ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించాను. ఇంత సంపన్నమైన కార్పొరేషన్ అయినా బాండ్లకు వెళ్లాల్సి వచ్చింది. అవినీతి రోజు రోజుకు పెరుగుతోందని అన్నారు. పుణే, పింప్రి–చించ్వాడ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతూ ప్రజలకు కావలసింది శుభ్రమైన రహదారులు, స్వచ్ఛమైన తాగునీరు, కాలుష్య నియంత్రణ. కానీ ట్యాంకర్ మాఫియా వల్ల అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ నీటి సమస్యలు ఉన్నాయని అజిత్ పవార్ చెప్పారు. కొంతమంది మైనర్ పిల్లలు కూడా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. చిన్న పిల్లలు గొడవలు పడటం, ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టడం, కార్ల అద్దాలు పగలగొట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు.

పోలీసు విభాగానికి పూర్తి మద్దతు

పుణే గార్డియన్ మంత్రిగా తాను పోలీస్ విభాగానికి పూర్తి మద్దతు ఇచ్చినట్లు అజిత్ పవార్ వివరించారు. ప్రతి ఏడాది పోలీస్ శాఖకు అవసరమైన వాహనాలు, బైకులు, వాకీటాకీలు, సీసీటీవీ కెమెరాలు వంటి మౌలిక వసతులకు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. కొత్త పోలీస్ స్టేషన్లు, అవుట్‌పోస్టులకు అనుమతులు ఇచ్చాం. పుణే, పింప్రి–చించ్వాడ్‌లో కమిషనర్ కార్యాలయాల పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. జనాభా పెరుగుదల నేపథ్యంలో అదనపు పోలీస్ సిబ్బందికి కూడా అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పోలీసుల నివాస సమస్యను కూడా పరిష్కరించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రహదారులు, రింగ్ రోడ్లు వంటి పనులకు పూర్తి సహకారం అందిస్తున్నాయి. కానీ స్థానిక స్థాయిలో కావాల్సిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ కూడా భారతదేశ ప్రధానమంత్రి అవుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేత నితీష్ రాణే తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు దేశాన్ని ‘ఇస్లామిక్ స్టేట్’గా మార్చాలనే బెదిరింపులుగా అభివర్ణించారు. ఇదే సమయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, మరాఠీ భాష, భూమి, గుర్తింపుపై ముప్పు ఉందని హెచ్చరిస్తూ మరాఠీ ఐక్యతకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన వారు మహారాష్ట్రపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.

గమనార్హంగా, రాష్ట్ర ప్రభుత్వంలో మహాయుతి కూటమిలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ, శివసేన భాగస్వాములతో విడిపోయి, తన మేనమామ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీతో కలిసి పోటీ చేస్తున్నారు. జనవరి 15న ముంబయి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, జనవరి 16న ఫలితాలు వెలువడనున్నాయి. ముంబయి ఎన్నికల కోసం రాజ్ ఠాక్రే – ఉద్ధవ్ ఠాక్రే కూటమి ఏర్పడగా, పుణే, పింప్రి-చించ్వాడ్ ఎన్నికల కోసం అజిత్ పవార్ వర్గం – శరద్ పవార్ వర్గం కలిసి పోటీ చేయనున్నాయి.