Let's talk: editor@tmv.in
మత్స్యకారుల 72 లక్షల నష్టపరిహారంకు ఆమోదం తెలిపిన మారిటైమ్ బోర్డ్

మత్స్యకారుల 72 లక్షల నష్టపరిహారంకు ఆమోదం తెలిపిన మారిటైమ్ బోర్డ్

Panthagani Anusha
9 నవంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని ఏపీ మారిటైమ్ బోర్డు కార్యాలయంలో జరిగిన 20వ ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ సమీక్షా సమావేశంలో ఆయన ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో చర్చించారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు.

ఇటీవల ' మొంథా ' తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ ప్రాంతంలో నష్టం వాటిల్లిన 26 బోట్ల యజమానులకు రూ.72 లక్షల నష్టపరిహారం అందించేందుకు మారిటైమ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తీర ప్రాంతాల్లో సైక్లోన్ సమయంలో మత్స్యకారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, అవసరమైన సమయాల్లో పోలీసుల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు.

అంతేకాకుండా కార్తీకమాసం వంటి సందర్భాల్లో బీచ్‌లకు పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకుల రక్షణ కోసం పర్యాటక శాఖతో కలిసి 'సేఫ్‌గార్డ్ బాయ్‌లను' నియమించాలని మంత్రి అధికారులకు సూచించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఆక్వా రైతులను ఆదుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, సీఈఓ అభిషేక్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జీవీ రాఘవరావు, ఫిషరీస్ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మత్స్యకారుల 72 లక్షల నష్టపరిహారంకు ఆమోదం తెలిపిన మారిటైమ్ బోర్డ్ - Tholi Paluku