Let's talk: editor@tmv.in
మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు : మంత్రి అచ్చెన్నాయుడు

మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు : మంత్రి అచ్చెన్నాయుడు

Pinjari Chand
22 ఆగస్టు, 2026

గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారుల బోటు ఆచూకీ కోసం సముద్రంలో విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండింగ్ ఆఫీసర్ రంజిత్ కుమార్‌తో సంబంధిత అధికారులు మాట్లాడి గాలింపు చర్యల పురోగతిని తెలుసుకున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 5 కోస్ట్‌గార్డ్ నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, ఒక హెలికాప్టర్‌తో సముద్రంలో గాలింపు కొనసాగుతోందని కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించినట్లు చెప్పారు. మత్స్యకారుల బోటుకు సంబంధించిన వివరాలను మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్‌తోపాటు బంగ్లాదేశ్ సరిహద్దు తీర ప్రాంతాల్లోని కోస్ట్‌గార్డ్ అధికారులకు కూడా అందజేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోనూ బోటు ఆచూకీ కోసం అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు.

గాలింపు ఆగదు

ప్రస్తుతం బోటు ఆచూకీ లభించనప్పటికీ.. సెర్చ్ ఆపరేషన్‌లో ఎలాంటి విరామం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 24 తర్వాత బాధ్యతలు స్వీకరించే అధికారి కూడా గాలింపు చర్యలను కొనసాగిస్తారని కోస్ట్‌గార్డ్ అధికారులు తెలిపినట్లు వెల్లడించారు. మత్స్యకారులను సురక్షితంగా స్వస్థలానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని మంత్రి కోరారు. బోటు ఆచూకీ లభించి, మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చే వరకు అన్ని మార్గాల్లో గాలింపు కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.