Let's talk: editor@tmv.in
మత్స్యకారుల కోసం పవన్ కళ్యాణ్ ప్రణాళిక

మత్స్యకారుల కోసం పవన్ కళ్యాణ్ ప్రణాళిక

FL - SUNL
18 అక్టోబర్, 2025

మత్స్యకారుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. దీనిలో భాగంగా, శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

వేట సామర్థ్యం, అదనపు ఆదాయంపై చర్చలు

మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, వారికి అదనపు ఆదాయం సముపార్జన కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, విశాఖ ప్రధాన శాస్త్రవేత్త డా. జోయ్ కె. కిజాకుడాన్ తో పాటు రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఉప్పాడ సమస్యల పరిష్కారంపై 100 రోజుల ప్రణాళిక

ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారంపై 100 రోజుల ప్రణాళికలో భాగంగా తీసుకున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు.

ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడం, వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించాలని అధికారులను పవన్ కళ్యాణ్ సూచించారు.

ముఖ్యంగా, చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యాన్ని పెంచడం, తగిన సౌకర్యాలను కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.

మత్స్య సంపదను పెంపొందించడం వంటి అంశాలపై డాక్టర్ జోయ్ కె. కిజాకుడాన్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. శాస్త్రవేత్త సూచనలను అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ, మత్స్య శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారుల కోసం పవన్ కళ్యాణ్ ప్రణాళిక - Tholi Paluku