
మతాల మధ్య 'లవ్' చిచ్చు
'ఐ లవ్ మహ్మద్' వర్సెస్ 'ఐ లవ్ మహాదేవ్' నినాదాలు భారతదేశమంతటా తుఫానులా విస్తరిస్తున్నాయి. ఈ నినాదాలు మొదట సోషల్ మీడియాలో కనిపించాయి.. ఆ తరువాత వీధుల మీద పోస్టర్ల రూపంలో వ్యాపించాయి. ఒకవైపు మహ్మద్ పట్ల భక్తిని వ్యక్తం చేస్తూ పోస్టర్లు ఉంచగా, మరోవైపు మహాదేవుడి పట్ల ఆరాధనను చూపిస్తూ ప్రతిస్పందనగా పోస్టర్లు పుట్టుకొచ్చాయి. ఈ రెండు నినాదాల పోటీ క్రమంగా రెండు మతాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది.
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో నవరాత్రి సందర్భంలో జరుగుతున్న గర్భా ఉత్సవం ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైంది. మొదటగా కొందరు యువకులు వాట్సాప్ స్టేటస్‌లలో పోటి పడి స్లోగన్స్ పెట్టారు. ఇది ఇరు సమూహాల మధ్య కోపాన్ని పెంచింది. ఆ తర్వాత ఈ గొడవ వీధుల మీదికి వచ్చింది. గర్భా జరుగుతున్న పండల్ దగ్గర రాళ్లదాడులు జరిగాయి. దుకాణాలు దగ్ధమయ్యాయి, వాహనాలు తగలబెట్టబడ్డాయి, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు ఇప్పటివరకు 60 మందికి పైగా అరెస్టు చేసి, మరికొంతమంది కోసం గాలిస్తున్నారు. ఇటు అధికారులు ఆ ప్రాంతాన్ని సైనిక కంటోన్మెంట్‌లా మార్చి భారీ బలగాలను నియమించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో పోలీసులు నిరంతర గస్తీ కాస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర. రాత్రివేళలో లైట్లు ఆపేసి మరి చీకట్లో తన్నుకున్నారు. ఈ ఘటన 2002 గోద్రా అల్లర్ల జ్ఞాపకాన్ని మళ్ళీ తలపిస్తోంది. గోద్రా సమయంలో లాగానే ఇక్కడ కూడా మతపరమైన వర్గాల మధ్య ఉన్న విభేదాలు సామాజిక అల్లర్లకు దారి తీశాయి. అయితే ప్రస్తుత హింస కొన్ని ప్రాంతంలోనే ఉంది. అయినా ప్రజలకు భారీ నష్టం కలిగింది. గాంధీనగర్‌లోని లాగానే ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. వారణాసిలో శివభక్తులు 'ఐ లవ్ మహాదేవ్' టాటూలు వేయించుకుంటూ తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మతపరమైన సంస్థలు పోస్టర్ల ద్వారా ప్రచారాలు కూడా చేపట్టాయి.
ప్రస్తుతం ఈ వివాదం దేశవ్యాప్తంగా వ్యాపిస్తూ ఒక మతపరమైన గొడవగా మారింది. ఒక సమూహం తమ విశ్వాసాన్ని బయటపెడుతుంటే మరో సమూహం కూడా తమ భావజాలాన్ని సమాన స్థాయిలో వ్యక్తం చేస్తోంది. ఈ పరస్పర ప్రతిస్పందన సమాజంలో శాంతి భద్రతలకు సవాళ్లు విసురుతోంది. ఇటు చిన్న చిన్న ఆన్‌లైన్ పోస్టులు కూడా పెద్ద స్థాయిలో అల్లర్లకు దారితీయగలవు. ఇది కేవలం ఒక ఘటన మాత్రమే కాదు, సమాజంలో పెరుగుతున్న ఉద్రిక్తతల సంకేతం.
ఇక 'ఐ లవ్ మహాదేవ్' అనే నినాదం వెనుక ఉన్న నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట 'ఐ లవ్ మహ్మద్' అనే ప్రచారం ఎలా మొదలైందో చూడాలి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బరావఫాత్ ఊరేగింపు సమయంలో కొన్ని పోస్టర్లు పెట్టడం ద్వారా ఈ ప్రచారం ఆరంభమైంది. ఈ పోస్టర్ల పట్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు టెంట్‌లు, పోస్టర్లు తొలగించగా వివాదం మరింత ముదిరింది. ముస్లింలు దీన్ని విశ్వాసానికి సంబంధించిన విషయం అని భావించి నిరసనలు చేపట్టారు. అనేక పట్టణాల్లో ఇదే తరహా పోస్టర్లు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కొందరు మతపెద్దలు నిరసనలు ప్రకటించగా అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
ఈ పరిణామాలకు ప్రతిస్పందనగా వారణాసి లాంటి పట్టణాల్లో హిందూ సంఘాలు ముందుకు వచ్చాయి. శివుని నగరమైన కాశీలో 'ఐ లవ్ మహాదేవ్' అనే పోస్టర్లు దర్శనమిచ్చాయి. క్రమంగా ఇది పోస్టర్ల దాటి టాటూల వరకు విస్తరించింది. యువతలో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. టాటూ దుకాణాల్లో వందలాది భక్తులు తమ చేతులపై ఈ నినాదాన్ని వేయించుకున్నారు. ఈ విధంగా ఒక మతపరమైన ప్రచారం మరొక మతపరమైన ప్రతిస్పందనకు దారితీసింది. కాన్పూర్‌లో ప్రారంభమైన ఈ చిన్న వివాదం వారణాసి, బరేలీ, లక్నో, గాంధీనగర్ లాంటి అనేక నగరాలకు వ్యాపించింది.
ఎక్కడైతే పోస్టర్లు కనిపించాయో అక్కడ ఉద్రిక్తతలు పెరిగాయి. కొన్ని చోట్ల నిరసనలు, కొన్ని చోట్ల అల్లర్లు, మరికొన్ని చోట్ల పోలీసు బందోబస్తు కనిపించింది. ఇక ఇప్పటికి ఈ వివాదం సామాజిక శాంతి భద్రతలపై ప్రభావం చూపుతోంది. చిన్నచిన్న నినాదాలు కూడా పెద్ద ఘర్షణలకు మారే ప్రమాదం ఉందని గాంధీనగర్‌లోని ఘటన బలంగా గుర్తు చేసింది. 2002 గోద్రా అల్లర్లను తలపించేలా పరిస్థితులు మారుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి చూడాలి.. భారత్ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వెయిట్ అండ్ సీ!
