
మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై త్వరలో సుప్రీం విచారణ
కేరళలోని శబరిమల ఆలయంతో సహా దేశంలోని మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తుది విచారణ ప్రారంభించనుందని సోమవారం తెలిపింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్ మాల్య బాగ్చీ, విపుల్ పంచోలీల బెంచ్ తెలిపిన ప్రకారం, చీఫ్ జస్టిస్ ఏర్పాటు చేసే 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏప్రిల్ 7న ప్రారంభించి, ఏప్రిల్ 22న విచారణను ముగిస్తుందని పేర్కోంది. ఆయా పక్షాలు తమ లిఖితపూర్వక వాదనలను మార్చి 14లోపు సమర్పించాలని సూచించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై, 2018లో శబరిమల ఆలయంపై ఇచ్చిన తీర్పును సమీక్షించే పిటిషన్లకు మద్దతు తెలిపారు.
సమీక్షకు మద్దతు ఇచ్చే పక్షాల తరఫున కృష్ణ కుమార్ సింగ్ ను నోడల్ కౌన్సెల్‌గా, సమీక్షకు వ్యతిరేకంగా ఉన్న పక్షాల తరఫున శశ్వతి పారినిను నియమించారు. అదేవిధంగా, సీనియర్ అడ్వకేట్ కె. పరమేశ్వర్, శివం సింగ్లను అమికస్ క్యూరిస్ గా నియమించారు.
విచారణ షెడ్యూల్
• ఏప్రిల్ 7–9: సమీక్ష పిటిషనర్ల వాదనలు
• ఏప్రిల్ 14–16: సమీక్షకు వ్యతిరేక వాదనలు
• ఏప్రిల్ 21: రిజాయిండర్ సమర్పణలు
• ఏప్రిల్ 22: అమికస్ ద్వారా తుది సమర్పణలు పార్టీలు ఆ షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలని కోర్టు ఆదేశించింది.
చట్టపరమైన అంశాలు
2018 శబరిమల తీర్పు అనంతరం మత స్వేచ్ఛ పరిధి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26ల అమలు, మత సముదాయాల హక్కులు వంటి అంశాలను 9 మందితో కూడిన న్యాయమూర్తుల బెంచ్ పరిశీలించనుంది. మత సముదాయానికి చెందని వ్యక్తి ఆ ఆచారాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ద్వారా సవాలు చేయగలడా? అనే అంశాన్ని కూడా పరిశీలించనుంది. శబరిమల కేసుతో పాటు, ముస్లిం మహిళల మసీదులు, దర్గాల్లో ప్రవేశం, పార్సీ మహిళల అజియరీ ప్రవేశ అంశాలను కూడా ఈ బెంచ్ పరిగణనలోకి తీసుకుంది.
దేశవ్యాప్తంగా పలు ఆరాధనా స్థలాల్లో మహిళల ప్రవేశంపై వివాదాలు
దేశంలోని కొన్ని ప్రసిద్ధ ఆరాధనా స్థలాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించిన పరిమితులు గత కొన్నేళ్లుగా న్యాయపర, సామాజిక చర్చలకు దారి తీసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు, హైకోర్టుల జోక్యంతో పలుచోట్ల మార్పులు వచ్చినప్పటికీ, కొన్ని అంశాలు ఇంకా న్యాయపర పరిశీలనలోనే ఉన్నాయి.
శబరిమల ఆలయం – కేరళ
శబరిమల ఆలయంలో 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల ప్రవేశాన్ని సంప్రదాయ కారణాల వల్ల నిషేధించేవారు. 2018లో సుప్రీంకోర్టు అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పుపై దాఖలైన సమీక్ష పిటిషన్లు ఇంకా విచారణలో ఉన్నాయి. అమలు విషయంలో కూడా అప్పట్లో వివాదాలు చెలరేగాయి.
హాజీ అలీ దర్గా – ముంబై
హాజీ అలీ దర్గాలో మహిళలకు అంతర్గత సమాధి ప్రాంగణంలో ప్రవేశం నిరాకరించేవారు. 2016లో బాంబే హైకోర్టు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని తీర్పు ఇవ్వడంతో ప్రవేశాన్ని అనుమతించారు. ప్రస్తుతం మహిళలకు అక్కడ ప్రవేశం ఉంది.
శని శింగణాపూర్ దేవస్థానం – మహారాష్ట్ర
శని శింగణాపూర్ దేవస్థానంలో శని విగ్రహం సమీపానికి మహిళల ప్రవేశంపై పరిమితులు ఉండేవి. మహిళా సంఘాల ఆందోళనల తరువాత 2016లో ఆలయ ట్రస్ట్ ప్రవేశాన్ని అనుమతించింది.
పార్సీ అగియారీలు, కొన్ని జైన ప్రార్థనా స్థలాలు
పార్సీ మతస్థుల ఆరాధనా స్థలమైన అగియారీల్లో పార్సీ కాని వ్యక్తులకు ప్రవేశం ఉండదు. ముఖ్యంగా పార్సీయేతర పురుషులను వివాహం చేసుకున్న మహిళల ప్రవేశంపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ అంశం పలు కోర్టుల్లో పరిశీలనలో ఉంది. కొన్ని జైన ప్రార్థనా స్థలాల్లో కూడా సంప్రదాయ పరిమితులపై అప్పుడప్పుడూ చర్చలు తలెత్తుతున్నాయి.
కొన్ని మసీదులు
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలకు మసీదుల్లో ప్రవేశం నిరాకరించడం లేదా వేరే ప్రాంగణంలో మాత్రమే అనుమతించడం వంటి ఆచారాలు ఉన్నాయి. ఈ అంశంపై సమాన హక్కుల దృష్టితో దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
