
మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి, కాంగ్రెస్ అరాచకత్వానికి నిదర్శనం: రాకేష్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించింది. ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదిక ద్వారా ఈ దాడిని 'పక్కా ప్రణాళికతో, ప్రభుత్వ పెద్దల అండతో' జరిగిందని ఆయన ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
దాడి వివరాలు, బీఆర్ఎస్ ఆందోళన
భద్రాద్రి రాముడున్న భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాన్ని కాంగ్రెస్ రాజ్యం 'రావణ కష్టంగా' మారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉండి ఉంటే హత్య చేసేవారని రాకేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాను, కొత్తగూడెం ప్రాంతాలను కాంగ్రెస్ ప్రభుత్వం 'హత్య రాజకీయాలకు, అరాచకాలకు అడ్డా' చేసిందని విమర్శించారు.
ముగ్గురు మంత్రులపై విమర్శలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు – పొంగులేటి శ్రీనివాస్, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు – ఖమ్మం జిల్లాను 'మూడు ముక్కలాట' ఆడుతూ, 'ఆగం' పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. పది ఏళ్లు పచ్చగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాను 'రక్త శిక్తం' చేయడమే కాంగ్రెస్ 'ప్రజా పాలన లక్ష్యమా?' అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేయవచ్చు, కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను ఉమ్మడి ఖమ్మం, కొత్తగూడెం జిల్లా ప్రజలు 'ఉరికించి కొడతారు' అని హెచ్చరించారు.
ఈ దాడిపై ప్రభుత్వాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నిజంగా ఈ దాడి ప్రభుత్వ కనుసన్నల్లో జరగకపోతే, తక్షణమే దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి జైల్లో వేయాలి.ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, దాడిలో పాల్గొన్నవారిని కనీసం రెండు ఏళ్లు 'నగర బహిష్కరణ' చేయాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
