Let's talk: editor@tmv.in
మణిపూర్‌లో శాంతి దిశగా తొలి అడుగు

మణిపూర్‌లో శాంతి దిశగా తొలి అడుగు

Pinjari Chand
23 మార్చి, 2026

మణిపూర్‌లో కొనసాగుతున్న జాత్యహంకార ఉద్రిక్తతల మధ్య శాంతి పునరుద్ధరణకు కీలక పరిణామం చోటుచేసుకుంది. కుకీ-జో కౌన్సిల్ ప్రతినిధులతో జరిగిన సమావేశాన్ని ‘మంచి ఆరంభం’గా అభివర్ణించిన ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ , భవిష్యత్తులో చర్చలు కొనసాగుతాయని వెల్లడించారు. గువాహటిలో శనివారం జరిగిన ఈ సమావేశం దాదాపు మూడు సంవత్సరాల తరువాత మొదటిసారి జరగడం విశేషం. దాదాపు గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ ప్రధానంగా పరిచయ సమావేశంగా (ఐస్ బ్రేకింగ్ సెషన్) జరిగిందని కుకీ-జో కౌన్సిల్ తెలిపింది. 2023 మే నుంచి మెయితీలు, కుకీ-జో వర్గాల మధ్య చెలరేగిన హింసలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

విశ్వాసం పునరుద్ధరణే కీలకం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంటర్నల్‌గా నిర్వాసితులైన ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లలేకపోవడం అత్యంత బాధాకరం. వారిని తిరిగి పంపాలంటే రెండు వర్గాల మధ్య విశ్వాసాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర బలగాలు ఎంతకాలం భద్రత కల్పిస్తాయి? ప్రజల మధ్య నమ్మకం పెరగడం ద్వారా మాత్రమే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. శాంతి స్థాపన కోసం ‘క్షమించి మర్చిపోవాలి’ అనే భావనతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ చర్చలలో ఎలాంటి డిమాండ్లు లేదా హామీలు లేవు. ఇది కేవలం శాంతి, విశ్వాస పునర్నిర్మాణానికి తొలి అడుగు మాత్రమే అని పేర్కొన్నారు.

విభజన డిమాండ్‌పై స్పష్టత

ప్రత్యేక పరిపాలన డిమాండ్‌పై స్పందిస్తూ మణిపూర్ భౌగోళిక సమగ్రత ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినదని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. బఫర్ జోన్ అంశంపై మాట్లాడుతూ, ప్రభుత్వం దాన్ని ‘సెన్సిటివ్ జోన్​’గా పరిగణిస్తోందని, నమ్మకం లేని కారణంగా భద్రతా బలగాలు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నాయని వివరించారు.

కౌన్సిల్ అభిప్రాయం

ఇదిలా ఉండగా, కుకీ-జో కౌన్సిల్ ప్రతినిధులు సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు. కుకీ, టాంగ్ఖుల్ వర్గాల మధ్య ఉద్రిక్తత తగ్గించాల్సిన అవసరం, బాధితులకు న్యాయం చేయడం శాంతి ప్రక్రియకు కీలకమని పేర్కొన్నారు. అలాగే శాశ్వత పరిష్కారం వచ్చే వరకు బఫర్ జోన్ పవిత్రతను కాపాడాలని, కొనసాగుతున్న ఒప్పంద చర్చలను వేగవంతం చేయాలని కోరారు. మూడేళ్ల తర్వాత మొదలైన ఈ చర్చలు మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు తొలి అడుగుగా భావిస్తున్నారు. విశ్వాస పునర్నిర్మాణం, సంభాషణల కొనసాగింపు ద్వారానే దీర్ఘకాలిక శాంతి సాధ్యమవుతుందని ప్రభుత్వం, కుకీ-జో కౌన్సిల్ రెండూ భావిస్తున్నాయి.

మణిపూర్‌లో శాంతి దిశగా తొలి అడుగు - Tholi Paluku