Let's talk: editor@tmv.in
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

Pinjari Chand
10 ఫిబ్రవరి, 2026

మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం మరోసారి హింస చెలరేగింది. లిటాన్ సారేఖాంగ్ గ్రామంలో ఆయుధాలతో వచ్చిన దుండగులు మరికొన్ని ఇళ్లకు నిప్పంటించినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో కొండ ప్రాంత గ్రామ పరిసరాల్లో ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలతో గ్రామస్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమైన వస్తువులతో కలిసి సమీపంలోని కాంగ్‌పోక్ఫి జిల్లాలోని సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. పలువురు తాంగ్‌ఖుల్ వర్గానికి చెందిన ప్రజలు కూడా గ్రామాన్ని విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతంలో హింస శనివారం రాత్రి మొదలైంది. లిటాన్ గ్రామంలో తాంగ్‌ఖుల్ నాగ వర్గానికి చెందిన ఒక వ్యక్తిపై ఏడుగురు–ఎనిమిది మంది దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితుడి కుటుంబం, లిటాన్ సారేఖాంగ్ గ్రామాధిపతి మధ్య చర్చలు జరిగి, సంప్రదాయ పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఆదివారం సమావేశం జరగాల్సి ఉండగా, అది జరగలేదని అధికారులు తెలిపారు. దీని తరువాత సమీపంలోని సికిబుంగ్ గ్రామానికి చెందిన కొంతమంది లిటాన్ సారేఖాంగ్ గ్రామాధిపతి నివాసంపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే లిటాన్ పోలీస్‌స్టేషన్ పరిసరాల గుండా వెళ్తూ కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆదివారం రాత్రి రెండు గిరిజన వర్గాల మధ్య తీవ్ర రాళ్లదాడి జరగడంతో, పరిపాలన యంత్రాంగం నిషేధాజ్ఞలు అమలు చేసింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో తాంగ్‌ఖుల్ నాగ వర్గానికి చెందిన అనేక ఇళ్లకు కుకీ మిలిటెంట్లు నిప్పంటించారని అధికారులు తెలిపారు. అదే సమయంలో సమీప ప్రాంతంలో కుకీ వర్గానికి చెందిన కొన్ని ఇళ్లు కూడా దగ్ధమైనట్లు చెప్పారు.

మణిపూర్‌లో అతిపెద్ద నాగ తెగగా తాంగ్‌ఖుల్ గుర్తింపు పొందింది. ఈ ఘటనలపై స్పందించిన రాష్ట్ర మంత్రి గోవిందాస్ కొంతౌజం, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి ఎల్ డిఖో గ్రామస్థులతో మాట్లాడుతున్నారు. సమావేశం జరిగిన కొద్దిసేపటికే మరిన్ని ఇళ్లకు నిప్పంటించినట్లు సమాచారం వచ్చింది. ఉదయం 5 గంటల వరకు 17 ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం మొత్తం 21 ఇళ్లు కాలిపోయాయని ఆయన మీడియాకు తెలిపారు. తాజా హింస నేపథ్యంలో అదనపు భద్రతా బలగాలను మోహరించామని ఆయన చెప్పారు.

ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి ఎల్ డిఖో నేతృత్వంలో తాంగ్‌ఖుల్ నాగ పౌర సంఘాలు, కుకీ ఎమ్మెల్యే పాల్గొన్న సమావేశం లిటాన్‌లో జరిగింది. ఈ సమావేశంలో తాంగ్‌ఖుల్ నాగ లాంగ్, తాంగ్‌ఖుల్ షనావో లాంగ్ ప్రతినిధులు, అస్సాం రైఫిల్స్ అధికారులు, ఉఖ్రుల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కుకీ వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. డిఖో హింస ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, నాగ, కుకీ గ్రామాధిపతులతో సమావేశమయ్యారు. ఇరు వర్గాలు శాంతిని కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు.

ఈ సమావేశం సానుకూలంగా జరిగింది. అందరూ శాంతిని కోరుకుంటున్నారు. తక్షణమే తుది నిర్ణయానికి రావడం కష్టం అయినా, హింస కొనసాగకూడదన్న విషయంలో ఏకాభిప్రాయం ఉందని డిఖో అన్నారు. ఈ ఘటన కొద్దిమంది వ్యక్తుల చర్యల వల్లే జరిగిందని, ఇది విస్తృత సామాజిక ఉద్రిక్తతగా మారకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతా బలగాలు గస్తీ నిర్వహిస్తూ, కీలక ప్రాంతాల్లో మోహరింపుతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి వై ఖేమ్‌చంద్ సింగ్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉఖ్రుల్ జిల్లాలో లిటాన్ ఘటనలో గాయపడిన వారిని ఈ ఉదయం రిమ్స్ ఆసుపత్రిలో కలిసి, అవసరమైన వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చాను. అపోహల వల్ల ఏర్పడిన ఈ ఘటన ప్రస్తుతం నియంత్రణలో ఉంది. అన్ని వర్గాలు సంయమనం పాటించి, చట్టాలను గౌరవించి, శాంతి సామరస్యాలను కాపాడాలని కోరుతున్నానని ముఖ్యమంత్రి తెలిపారు.

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస - Tholi Paluku