
మణిపూర్‌లో కొత్త ప్రభుత్వానికి విద్యార్థుల సెగ
మణిపూర్‌లో ఇటీవలే నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు వై. ఖేమచంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఎంపికను కుకీ–జో విద్యార్థి సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. తమ సమస్యలను తీర్చకుండా సీఎం ను నియమించడాన్ని తప్పుపట్టింది. ఈ సందర్భంగా వారు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి తాము బలమైన వ్యతిరేకత తెలుపుతున్నట్లు కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (కేఎస్‌ఓ) – ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రకటించింది. కుకీ–జో ప్రజలు ఇప్పటికీ బలవంతంగా వెళ్లగొట్టటం, భద్రత లేకపోవడం, మానసిక వేదనను అనుభవిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రభుత్వం తమ దృష్టిలో నైతికంగానూ, రాజకీయంగానూ చట్టబద్ధత కోల్పోయిందని సంఘం పేర్కొంది. శనివారం జంతర్‌మంతర్ వద్ద కేఎస్‌ఓ సభ్యులు నిరసన చేపట్టి, మణిపూర్‌లో జరిగిన జాతి హింస బాధితులకు న్యాయం, పునరావాసం, బాధ్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక ప్రకటనలో కేఎస్‌ఓ, న్యాయం, బాధ్యత, ప్రభావిత వర్గాల సమ్మతి లేకుండా పరిపాలనా సాధారణ స్థితిని అమలు చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేసింది. కొండ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. 2023 మే నుంచి కొనసాగుతున్న హింస తీవ్రత, దీర్ఘకాలిక స్వరూపం తిరుగులేని రాజకీయ విరోధాన్ని సృష్టించింది. కుకీ–జో ప్రజలు ఇకపై మణిపూర్ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో భాగమని భావించడం లేదని విద్యార్థుల సంఘం పేర్కొంది.
ఇటీవల మణిపూర్‌లో ఏర్పాటైన ‘అంటూ పిలవబడుతున్న ప్రజాదరణ ప్రభుత్వాన్ని’ కేఎస్‌ఓ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ చర్చలను వేగవంతం చేసి, ఆర్టికల్ 239ఏ (పుదుచ్చేరి నమూనా) ప్రకారం శాసనసభ కలిగిన యూనియన్ టెర్రిటరీ కింద ప్రత్యేక పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. దీని ద్వారా స్వయం ప్రతిపత్తి, రాజ్యాంగ పరిరక్షణలు కల్పించాలని కోరింది. ఇప్పటికీ బలవంతంగా వెళ్లగొట్టటం, భద్రత లేకపోవడం, మానసిక గాయాలతో జీవిస్తున్న కుకీ–జో ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వానికి నైతిక లేదా రాజకీయ చట్టబద్ధత లేదు. న్యాయం, బాధ్యత లేకుండా పరిపాలనా సాధారణ స్థితిని బలవంతంగా అమలు చేయడం అంగీకారయోగ్యం కాదని ప్రకటనలో పేర్కొంది.
మాజీ సీఎం పై సమగ్ర దర్యాప్తు చేయాలి
అలాగే హింసకు బాధ్యులైన వ్యక్తులు, గుంపులపై ముఖ్యంగా అరంబాయి టెంగ్గోల్ నాయకత్వంపై అరెస్టులు, విచారణలు చేపట్టి, భవిష్యత్తులో అతివాద కార్యకలాపాలు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేఎస్‌ఓ డిమాండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్‌కు సంబంధించినట్లు వెలువడిన ఆడియో రికార్డింగులపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపి, చట్టపరమైన ప్రక్రియలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. కుకీ–జో బాధితులపై జరిగిన అన్ని నేరాల్లో న్యాయం, శిక్షలు ఖరారు చేయాలని పేర్కొంది. రవాణా సమస్యలు తీవ్రమైన నేపథ్యంలో, కుకీ–జో ప్రాంతాల్లో విమానాశ్రయం సహా కీలక మౌలిక వసతులకు ఆమోదం ఇవ్వాలని కూడా సంఘం డిమాండ్ చేసింది.
బుధవారం బీజేపీ నేత వై. ఖేమచంద్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో దాదాపు ఏడాది పాటు కొనసాగిన రాష్ట్రపతి పాలన ముగిసింది. కుకీ వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా కిప్గెన్, నాగ పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎల్. దిఖో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. 2023 మేలో మెయిటే వర్గానికి ఎస్టీ హోదా డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ ప్రాంతాల్లో జరిగిన ‘ట్రైబల్ సాలిడారిటీ మార్చ్’ అనంతరం మణిపూర్‌లో మెయిటే–కుకీ వర్గాల మధ్య జాతి ఘర్షణలు చెలరేగాయి. ఈ హింసలో ఇప్పటివరకు కనీసం 260 మంది (రెండు వర్గాల ప్రజలు, భద్రతా సిబ్బంది సహా) మరణించగా, వేలాది మంది నిర్వాసితులయ్యారు.
