
మణిపూర్‌లో ఉద్రిక్తంగా జనగణన వ్యతిరేక నిరసన
మణిపూర్‌లో జరుగుతున్న జనగణన ప్రక్రియకు వ్యతిరేకంగా బుధవారం నిర్వహించిన నిరసన ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని ఐమా మార్కెట్ వద్ద ‘జస్ట్ అండ్ ఫెయిర్ డిలిమిటేషన్’(జేఎఫ్‌డీ) పేరిట ప్రజలు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించగా ఐదుగురు నిరసనకారులు గాయపడినట్లు సమాచారం. జేఎఫ్‌డీ సంస్థ సహాయ కార్యదర్శి నారేమ్ వాంగాంబా మాట్లాడుతూ, రాష్ట్రంలో ‘న్యాయమైన, పారదర్శకమైన జనగణన’ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్రమ వలసదారులను గుర్తించకుండా జనగణన కొనసాగిస్తే వారు చట్టబద్ధ భారతీయ పౌరులుగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 1951ను కట్‌ఆఫ్ సంవత్సరంగా తీసుకుని అక్రమ వలసదారులను ముందుగా గుర్తించాలని కోరారు.
అక్రమ వలసదారుల గుర్తింపు పూర్తయ్యే వరకు మణిపూర్‌లో జనగణనను వాయిదా వేయాలని కోరుతూ గత డిసెంబర్ 15న కేంద్ర హోంమంత్రి కి మెమోరాండం సమర్పించినట్లు వాంగాంబా తెలిపారు. జనగణనకు ముందు నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్(ఎన్‌ఆర్‌సీ)ను నవీకరించాలని కూడా జేఎఫ్‌డీ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉండగా, ఇటీవల రాష్ట్రంలో జరిగిన జాతి హింసలో మరణించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉంగ్‌జాగిన్ వాల్టే సహా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చురచంద్‌పూర్‌లో సెంట్రల్ విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ రోడ్ మార్చ్ నిర్వహించింది. 2023లో ప్రారంభమైన మణిపూర్ ఎథ్నిక్ వయెలెన్స్‌లో కుకీ–జో, మైతేయి సముదాయాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
తుపాకులు స్వాధీనం చేసుకున్నాం: మంత్రి
ఇక మణిపూర్ అసెంబ్లీలో మాట్లాడిన రాష్ట్ర హోంమంత్రి గోవిందస్ కొంతౌజమ్, జాతి హింస ప్రారంభ సమయంలో లూటీకి గురైన తుపాకుల కంటే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. మొత్తం 6,020 తుపాకులు దోపిడీకి గురికాగా, భద్రతా బలగాలు ఇప్పటివరకు 7,437 తుపాకులను తిరిగి స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దులు విస్తారంగా ఉండటంతో అక్రమ ఆయుధాల స్మగ్లింగ్ జరుగుతోందని, దీనిని అడ్డుకునేందుకు సరిహద్దుల వెంట ఫెన్సింగ్ పనులు చేపడుతున్నట్లు వివరించారు.
