Let's talk: editor@tmv.in
మూడు రాజధానులపై మారిన వైసిపి వైఖరి

మూడు రాజధానులపై మారిన వైసిపి వైఖరి

Dr.Chokka Lingam
15 సెప్టెంబర్, 2025

మూడు రాజధానుల విషయంలో వైసీపీ స్టాండ్ మారిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి రాజధాని విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయమే కారణమని భావిస్తోందా? అందుకే ఈ సారి అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలన జరుగుతుందని సజ్జల చెప్పారా?

వైసీపీ ఓటమికి కారణాలు అనేకానేకం వినిపిస్తాయి. అయితే ప్రధానంగా రాజధాని విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం వైసీపీ ఓటమిని శాసించిందన్న అభిప్రాయం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. అనేక ప్రాంతాలు పరిశీలించిన తర్వాత చివరకు అమరావతిని రాజధాని ప్రాంతంగా అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించినప్పుడు రాజధానిగా అమరావతి నిర్మాణానికి అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ ఆయోదం తెలిపారు. దీనిపై ఆయన స్వయంగా అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. ఆ తర్వాత ఏపీలో రాజధాని నిర్మాణపనులు వేగంగా సాగాయి. సెక్రటేరియట్, హైకోర్టు వంటి తాత్కాలిక భవనాలను యుద్ధప్రాతిపదికన నిర్మించారు. ఇక అమరావతే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అన్న భావన స్థిరపడిపోయింది. ఆ క్రమంలోనే 2019 ఎన్నికలొచ్చాయి.

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ ఓటమికి ప్రధానంగా చెప్పే కారణాల్లో ఒకటి అమరావతిలో నిర్మించిన భవనాలన్నింటినీ తాత్కాలికం అని అప్పట్లో చంద్రబాబు చెప్పడమని, తాత్కాలిక నిర్మాణాలకే ఐదేళ్ల సమయం పడితే ఇక శాశ్వత భవనాలు ఎప్పుడు నిర్మిస్తారని ప్రజలు భావించారని రాజకీయ విశ్లేషకులు అంటారు. అదే సమయంలో జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకోవడంతో అమరావతిని రాజధానిగా కొనసాగించడంలో ఆయనకు ఎలాంటి అభ్యంతరం లేదని అంతా భావించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలు రాజధానిపై ఏమీ మాట్లాడని జగన్ అకస్మాత్తుగా ఓ రోజు అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి మాట్లాడారు. ఇక అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రహసనం మొదలయింది.

ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులుండాలని, అభివృద్ధి వికేంద్రీకరణని, పరిపాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చూసి ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా, మరోసారి విభజన వాదం తలెత్తకుండా చేస్తామని వైసీపీ నేతలు చెప్పడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అల్లకల్లోలంగా మారాయి. అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. అమరావతి పరిధిలోకొచ్చే గ్రామాల్లో స్మశాన నిశ్శబ్దం నెలకొంది.

అమరావతి రైతుల ఉద్యమం ఎంత ఉధృతంగా సాగినా అప్పటి వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మూడు రాజధానులను ఆంధ్రప్రదేశ్కు ఏర్పాటుచేసి తీరుతామని అప్పటి సీఎం జగన్, ఆయన క్యాబినెట్లోని మంత్రులు నిరంతరాయంగా చెప్తుండేవారు. విశాఖలో సీఎం జగన్ ఇల్లు నిర్మించుకుంటున్నారని, అతి త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని పలుమార్లు వైసీపీ నుంచి ప్రకటనలు వచ్చేవి. స్వయంగా జగన్ సైతం మరో ఆరు నెలల్లో విశాఖ నుంచి పాలన మొదలవుతుందంటూ అనేకమార్లు చెబుతూ వచ్చారు. అయితే ఐదేళ్ల కాలంలో ఇటు అమరావతిలో గానీ, అటు విశాఖలోగానీ, ఇంకోపక్క కర్నూలులోగానీ మూడు రాజధానుల అవసరాలకు తగ్గట్టుగా భారీ నిర్మాణాలేమీ జరగలేదు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఎలా ఉన్నాయో ఐదేళ్ల తర్వాత కూడా అలాగే ఉండిపోయాయి. రాజధాని నిర్మాణానికి భూములు సేకరించిన ప్రాంతం మొత్తం అటు పంటలకూ పనికిరాక, ఇటు నిర్మాణాలు జరగక వ్యర్థంగా ఉండిపోయింది. మీ రాజధాని ప్రాంతం ఏదని ఎవరన్నా అడిగితే ఇదని చెప్పలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎదురయింది. కేంద్రం సైతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఓ ప్రాంతాన్ని గుర్తించలేకపోయింది.

జీవనోపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రజలు రాష్ట్ర పరిస్థితిపై సానుభూతి వ్యక్తంచేసేవారు. ఒకప్పుడు ఆంధ్రప్రజలను తీవ్రంగా వ్యతిరేకించినవారు సైతం ఆంధ్రప్రదేశ్ ఇలా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని సానుభూతి మాటలు మాట్లాడేవారు. దేశం మొత్తం ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇది ఓ రకంగా జగన్ ప్రభుత్వంపైనా, ఆయన పైనా వ్యతిరేకతకు దారితీసిందని, రాజకీయంగా టీడీపీతో ఎన్ని విభేదాలున్నా, అమరావతిపై ఆయనకు ఎన్ని అభ్యంతరాలున్నా రాజధాని జోలికి జగన్ వెళ్లకుండా ఉంటే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడసాగారు.

కానీ ఆ సమయంలో జగన్గానీ, వైసీసీ మంత్రులు గానీ ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఉండాల్సి రావడంపై ప్రజల్లో అంతర్లీనంగా అసంతృప్తి ఉందన్న విషయాన్ని వైసీసీ అంచనా వేయలేకపోయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి దారితీసిన ప్రధాన కారణాల్లో రాజధానిపై ఆడిన ఆట ఒకటన్నది అందరూ అంగీకరించే నిజం. జగన్కు, వైసీసీకి కరుడుగట్టిన మద్దతుదారులుగా ఉండేవారు సైతం రాజధాని విషయంలో జగన్ వ్యవహారశైలిని జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన అమరావతిని రాజధానిగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం వారికి లాభం కలిగించింది.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిరుడు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి అమరాతిలో మళ్లీ కదలిక ఏర్పడింది. రాజధాని ప్రాంతంల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అమరావతి విషయంలో ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు కానీ మూడు రాజధానుల ప్రతిపాదనకు మాత్రం ఎవరినుంచీ సానుకూలత లేదన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. అందుకే అధికారం కోల్పోయిన ఏడాది తర్వాత వైసీపీ తన వైఖరిని మార్చుకోవాల్సివచ్చింది. ఆ విషయాన్ని బహిరంగంగా అంగీకరించాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అమరావతి నుంచే పరిపాలన ఉంటుందని, జగన్ విశాఖకు వెళ్లబోరని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 2024లో గెలిచి ఉంటే మాత్రం విశాఖ నుంచే పాలించేవారని, ఇప్పుడాఉద్దేశం లేదని వివరించారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అంగీకరించారు. రాజధాని నిర్మాణానికి అయ్యే వ్యయం భరించలేకనే విశాఖ గురించి జగన్ ఆలోచించినట్టు సజ్జల చెబుతున్నారు. గుంటూరు-విజయవాడ మధ్య అభివృద్ధి చేస్తే చాలని, మచిలీపట్నం కూడా కలిపితే మెగా సిటీ అవుతుందని సజ్జల అంటున్నారు.

ఏ కారణంతో అయినప్పటికీ రాజధాని విషయంలో వైసీపీ వైఖరి మారిందని, ఓటమికి దారితీసిన కారణాల్లో మూడు రాజధానుల ప్రతిపాదన ఒకటన్న గ్రహింపుకు వచ్చిందని అర్ధమవుతోంది. అయితే 2014-2019మధ్య రాజధానిగా అమరావతిని అంగీకరించిన జగన్, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారు. ఇప్పుడు మళ్లీ అమరావతిని అంగీకరిస్తున్నారు. ఈ సారి అధికారంలోకి వస్తే ఆయన అదే వైఖరితో ఉంటారా లేక మళ్లీ మాటమారుస్తారా అన్నది చూడాల్సి ఉంది. అలాగే రాజధాని విషయంలో మారిన వైసీపీ, జగన్ వైఖరిని ప్రజలు ఎంతమేర నమ్ముతున్నారు అన్నది కూడా తేలాల్సి ఉంది.

మూడు రాజధానులపై మారిన వైసిపి వైఖరి - Tholi Paluku