
మోడీ మాతృమూర్తి వీడియోను తొలగించండి
ప్రధాన మంత్రి తల్లి హీరాబెన్ పై బీహార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఏఐ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని పట్నా హైకోర్టు కాంగ్రెస్ పార్టీకి బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ పార్టీలో అంతర్గతంగా దర్యాప్తు జరుగుతుందని ఈ వీడియోను ఎవరూ పోస్ట్ చేశారు. ఎందుకు పోస్ట్ చేశారన్న అంశాలపై విచారణ చేస్తున్నామని, ప్రధాని తల్లిని అగౌరవపరచడం తమ ఉద్దేశం కాదని, ఆ వీడియోను తొలగిస్తామని ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది.
వీడియోలో ఏముంది?
36 సెకన్లు గల ఆ వీడియోలో ‘సాహబ్ కలలోకి అమ్మ వచ్చింది’ అనే క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో రానున్న ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేదిగా ఉందని ఆరోపించారు. ఇది ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందన్నారు. అయితే ఈ వీడియో రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని కోరారు.
అలాగే బీజేపీ నాయకులు పట్నాలో కాంగ్రెస్ పార్టీ పై కేసు పెట్టారు. ఢిల్లీలోనూ బీజేపీ ఎలక్షన్ సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు చేశారు. ప్రధాని తల్లి గౌరవం దెబ్బతీసేలా ఉందని, కేసు నమోదు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పట్నా హైకోర్టు విచారణకు స్వీకరించి ఆ వీడియోను తొలగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీబీ భజంత్రీ కాంగ్రెస్ పార్టీని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ చర్యలు అనాగరికమని ఇప్పటికైనా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని బీజేపీ నాయకులు హితవు పలికారు.
