
మూడు పదవులు ఏబీవీపీకే
ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎన్ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నేత జోస్లిన్ నందితా చౌదరిపై 16వేల ఓట్ల తేడాతో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నేత ఆర్యన్ మాన్ గెలిచారు. ఆర్యన్ 28,841 ఓట్లు సాధించగా.. జోస్లిన్ 12, 645 ఓట్లు సాధించారు. నాలుగు పదవుల్లో ఏబీవీపీ మూడు పదవులు కైవసం చేసుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పదవులను గెలుచుకుంది. కానీ వైస్ ప్రెసిడెంట్ పదవిని కోల్పోయింది. ఏబివిపికి చెందిన కునాల్ చౌదరి కార్యదర్శిగా, దీపికా ఘా జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఎన్ఎస్ యూఐకి చెందిన రాహుల్ ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్నారు.
ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికలపై ఎన్ఎస్ యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఎన్నికల్లో ఎన్ఎస్‌యూఐ బాగా పోరాడిందని తెలిపారు. ఇది కేవలం ఏబీవీపీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం మాత్రమే కాదని, డీయూ అడ్మిన్, ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, బీజేపీకి, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా అభివర్ణించారు. గెలిచిన ఓడిన ఢిల్లీ యూనివర్శిటీని కాపాడుకునేందుకు ఎన్ఎస్ యూఐ నిత్యం పోరాడుతుందని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ మరింత బలపడతామని వరుణ్ చౌదరి స్పష్టం చేశారు.
గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎన్ఎస్‌యూఐ అభ్యర్థి రోనక్ ఖాత్రి విజయం సాధించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఏడేళ్ల తర్వాత ఎన్ఎస్‌యూఐ అధ్యక్ష పదవితో పాటు, జాయింట్ సెక్రటరీ పదవిని గెలుచుకుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మాత్రం భారీ తేడాతో ఎన్ఎస్‌యూఐ ఓడిపోయింది. గురువారం జరిగిన ఢిల్లీ యూనివర్శిటీ ఎన్నికల్లో దాదాపు 40 శాతం మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మంది ప్రముఖ నాయకుల్ని దేశానికి అందించిన ఘనత ఢిల్లీ యూనివర్శిటీది.
