
మండలిలో మాటల మంటలు!
అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజైన మంగళవారం వాడీవేడీ చర్చ జరిగింది. మండలిలో మంత్రి లోకేష్ వర్సెస్ బొత్సగా సీన్ మారింది. వైసీపీ, కూటమి ఎమ్మెల్సీల మధ్య మాటల మంటలు రేగాయి. నాల్గవ రోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై చర్చకు సిద్ధంగా లేరని, ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.
సమావేశాలలో ఇలాంటి కీలక అంశాలపై చర్చ జరగకపోవడం ప్రతిపక్షాలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. తల్లిని రాజకీయం చేయొద్దు తల్లికి వందనంపై జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని మంత్రి లోకేష్ అవమానించారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాను ఏ మహిళనూ అవమానించలేదని లోకేష్ బదులిచ్చారు. మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని, మంత్రి నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. లోకేష్ మాటను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. తన తల్లిని అవమానించినప్పుడు మీరేం చేశారని లోకేష్ ప్రశ్నించారు. తల్లిని రాజకీయంగా వాడుకోవడం మానుకోవాలని బొత్స కౌంటరిచ్చారు. దీంతో బొత్స వ్యాఖ్యలను హోంమంత్రి అనిత తప్పుబట్టారు.
బీఏసీలో ఎందుకు చర్చించలేదు?
బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు స్పందిస్తూ మంత్రి నారా లోకేష్, గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలలో రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో ఉంచిందని ఆరోపించారు. ఇప్పుడు ఈ అంశంపై చర్చించాలని అడుగుతున్న బొత్స, బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌లో ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తనను డిక్టేట్ చేయడం సరికాదని, ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని లోకేష్ అన్నారు.
ఈ స్పందనతో సమావేశాలలో ఉద్రిక్తత మరింత పెరిగింది. మరోవైపు, మండలి చైర్మన్ ఈ వివాదంపై స్పష్టత ఇస్తూ, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత దానిపై మరిన్ని చర్చలు జరగవని తేల్చి చెప్పారు. ఇది సభా నియమావళికి అనుగుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, బొత్స సత్యనారాయణ మాత్రం తాము బకాయిలు పెట్టామన్న ఆరోపణలలో వాస్తవం లేదని, మంత్రి లోకేష్ మాటలు సరిగ్గా లేవని విమర్శించారు. దీంతో మండలిలో కాసేపు వైసీపీ వర్సెస్ కూటమిగా మారింది. చైర్మన్ మోషేన్ రాజు జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
