Let's talk: editor@tmv.in
మోడీతో ట్రంప్ భేటీకి సన్నాహాలు

మోడీతో ట్రంప్ భేటీకి సన్నాహాలు

Venkatesh Balusula
20 సెప్టెంబర్, 2025

భార‌త్‌పై అమెరికా సుంకాల పెంపుతో ఇరు దేశాల నేత‌ల న‌డుమ మాట‌ల యుద్ధం న‌డుస్తున్న వేళ ఆస‌క్తిక‌ర అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త్వ‌ర‌లో భేటీ కానున్న‌ట్లు అంత‌ర్జాతీయ నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. అక్టోబ‌రులో మ‌లేషియా రాజ‌ధాని కౌలాలంపూర్ లో ఆసియాన్ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. దీనికి డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ ఇద్దరూ హాజరవుతారని తెలుస్తోంది. ఈ స‌ద‌స్సు సందర్భంగా ఇద్దరూ క‌లిసే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ట్రంప్‌, మోడీ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతార‌ని, ఇరు దేశాల సంబంధాల‌పై చ‌ర్చిస్తార‌ని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవ‌ల మోడీ 75వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్రంప్ స్వ‌యంగా ఫోన్ చేసి శుభాకాంక్ష‌లు చెప్పారు.

చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైతే భార‌త్‌కు ట్రంప్

కౌలాలంపూర్ వేదిక‌గా 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాల‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 26-28 మధ్య ఈ సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశాల‌కు మొద‌టిసారి ట్రంప్ హాజ‌ర‌వుతున్నారు. దీనిపై మ‌లేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. ట్రంప్ త‌న‌కు స్వ‌యంగా ఫోన్ చేశార‌ని, స‌మావేశాల‌కు వ‌స్తున్న‌ట్లు చెప్పార‌ని తెలిపారు. భార‌త ప్ర‌ధాని మోడీ ఏటా ఈ స‌మావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే మలేషియాలో ట్రంప్, మోడీ భేటీపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. దీనిపై ఎలాంటి చర్చలు జరగలేదు. చైనా ప్రధాని లీ చియాంగ్ కూడా ఈ స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు. ఈ స‌ద‌స్సులో ట్రంప్, మోడీ భేటీ జరిగితే, నవంబర్‌లో భారత్‌లో జరిగే క్వాడ్ లీడర్స్ స‌ద‌స్సుకు మార్గం సుగమమవుతుంది. భార‌త్, అమెరికా మ‌ధ్య సంబంధాలు బ‌లంగా ఉంటే ట్రంప్ భారత్‌కు వచ్చి క్వాడ్ స‌ద‌స్సులో పాల్గొంటార‌ని తెలుస్తోంది. అమెరికా రాయబారి సెర్జియో గోర్ మాట్లాడుతూ ట్రంప్ క్వాడ్ స‌ద‌స్సుకు వస్తారని, నాయకులను కలుస్తార‌ని చెప్పారు. దీనికి స‌రైన తేదీ ఖ‌రారు చేయ‌లేదు.

ఇటీవల దిగుమ‌తి సుంకాలు, రష్యా చ‌మురు కొనుగోళ్ల‌ వంటి అంశాలతో భార‌త్‌, అమెరికా సంబంధాలు చిక్కుల్లో ప‌డ్డాయి. అమెరికాలో భార‌త్ దిగుమ‌తుల‌కు 25 శాతం సుంకాలు విధించేవారు. ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇటీవ‌ల ఆగ‌స్టులో వీటిని 50 శాతానికి పెంచారు. ఇది భారత్ ఎగుమతులపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. రష్యా నుంచి చ‌మురు కొనుగోళ్ల కార‌ణంగా సుంకాలు పెంచిన‌ట్లు అమెరికా బ‌హిరంగంగానే చెప్పింది. ఈ కొనుగోళ్లు ఆపితే సుంకాలు త‌గ్గిస్తామ‌ని, లేదంటే ఇంకా పెంచుతామ‌ని హెచ్చ‌రించింది. దీనిపై భార‌త్ స్పందిస్తూ దేశ అవ‌స‌రాల కోస‌మే చ‌మురు కొనుగోళ్లు చేస్తున్నామ‌ని, భార‌త్‌కు స్ప‌ష్ట‌మైన విదేశీ విధానం ఉంద‌ని, ఎలాంటి ఒత్తిళ్ల‌కు త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ఘ‌ట‌న‌తో పాటు భార‌త్, పాకిస్థాన్ సంఘర్షణ మ‌ధ్య అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ తిరస్కరించింది. హెచ్ 1బీ వీసాలు, వ్యవసాయ ఉత్పత్తులపై విభేదాలు కూడా ఉన్నాయి. ఈ వివాదాలు భార‌త్‌ను అమెరికాకు దూరం చేస్తూ రష్యా, చైనాల‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేలా చేశాయి. ఇటీవ‌ల ట్రంప్ మోడీకి ఫోన్ చేసి ఉక్రెయిన్ శాంతి చర్చలు, వాణిజ్య ఒప్పందంపై కీల‌క చ‌ర్చ‌లు చేశారు. మలేషియా భేటీలో సుంకాల తగ్గింపు, రష్యా చ‌మురు కొనుగోళ్లు, క్వాడ్ స‌ద‌స్సు ప్రణాళికలు, చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలు, ర‌క్ష‌ణ సహకారం, సాంకేతిక స‌హ‌కారం వంటి అంశాలపై చర్చ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ భేటీలో భార‌త్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి అగ్ర‌దేశంతో సంబంధాలు మెరుగుప‌ర్చుకునే అవకాశం ఉంది. అమెరికా ష‌ర‌తుల‌కు త‌లొగ్గే ప్ర‌సక్తే లేద‌ని ఇప్ప‌టికే భార‌త విదేశాంగ శాఖ స్ప‌ష్టం చేసింది. దేశ హ‌క్కుల‌ను గౌర‌విస్తూనే, ప్ర‌జ‌ల అవ‌స‌రాల మేర‌కు నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది. ఈ భేటీలో భార‌త్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందోనని ప్ర‌పంచ దేశాలు ఆస‌క్తిక‌రంగా గ‌మ‌నిస్తున్నాయి.

మోడీతో ట్రంప్ భేటీకి సన్నాహాలు - Tholi Paluku