
మడగాస్కర్‌లో 'గెజాని' తుపాను బీభత్సం.. 20 మంది మృతి!
ఆఫ్రికా ఖండం సమీపంలోని ద్వీప దేశం మడగాస్కర్‌ను 'గెజానీ' తుపాను అతలాకుతలం చేసింది. భారీ గాలులు, ఉధృతమైన వర్షాలతో విరుచుకుపడటంతో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్థరాత్రి దేశంలోని ప్రధాన నౌకాశ్రయ నగరం టోమాసినా వద్ద ఈ తుపాను తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఇళ్లు కూలిపోయి, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ ప్రకృతి విపత్తులో మరో 15 మంది గల్లంతవ్వగా, 33 మంది తీవ్రంగా గాయపడినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అంధకారంలో టోమాసినా..
దాదాపు మూడు లక్షల జనాభా ఉన్న టోమాసినా నగరం తుపాను ధాటికి పూర్తిగా చితికిపోయింది. నగరంలోని సుమారు 75 శాతం మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. విద్యుత్ స్తంభాలు నేలమట్టం కావడంతో మంగళవారం నుంచి నగరం అంధకారంలోనే ఉంది. నివాస గృహాలు, దుకాణాల పైకప్పులు ఎగిరిపోగా.. వీధులన్నీ శిథిలాలు, వరద నీటితో నిండిపోయి శ్మశానవాటికను తలపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధ్యక్షుడి పర్యటన
గత అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మైఖేల్ రాండ్రియానిరినా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. తుపాను ప్రభావంతో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. సుమారు 2,700 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
కోలుకోకముందే మరో దెబ్బ
పేదరికంతో మగ్గుతున్న మడగాస్కర్‌కు తుపానుల తాకిడి శాపంగా మారింది. కేవలం రెండు వారాల క్రితమే 'ఫైటియా' అనే తుపాను ఈ దేశాన్ని వణికించింది. ఆ ప్రమాదంలో 14 మంది మరణించగా, 85 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆ నష్టం నుంచి కోలుకోకముందే గెజానీ రూపంలో మరో విపత్తు వచ్చి పడటం ప్రజలను కోలుకోలేని దెబ్బతీసింది. ఐక్యరాజ్యసమితి ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది.
ముప్పు ఇంకా తొలగలేదు
ప్రస్తుతం గెజానీ తుపాను పశ్చిమ దిశగా కదులుతూ బలహీనపడి సాధారణ తుపానుగా మారింది. రాజధాని అంటాననరివోకు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇది ప్రయాణిస్తోంది. అయితే, గురువారం ఇది మడగాస్కర్-ఆఫ్రికా మధ్య ఉన్న సముద్ర మార్గంలోకి ప్రవేశించి, మళ్లీ బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వారం ఇది తిరిగి మడగాస్కర్ నైరుతి తీరాన్ని తాకే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
అభివృద్ధికి ఆటంకంగా ప్రకృతి వైపరీత్యాలు
ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ద్వీపమైన మడగాస్కర్ 2020 నుంచి ఇప్పటివరకు డజనుకు పైగా తుపానులను ఎదుర్కొంది. ప్రతి ఏటా ఈ తుపానుల వల్ల సుమారు 85 మిలియన్ డాలర్ల మేర మౌలిక సదుపాయాల నష్టం వాటిల్లుతోందని ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. నవంబర్ నుంచి మార్చి వరకు ఉండే తుపానుల సీజన్ దేశ అభివృద్ధిని దశాబ్దాల వెనక్కి నెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
