Let's talk: editor@tmv.in
మ‌డ‌గాస్క‌ర్‌లో కుప్ప‌కూలిన ప్ర‌భుత్వం

మ‌డ‌గాస్క‌ర్‌లో కుప్ప‌కూలిన ప్ర‌భుత్వం

Venkatesh Balusula
14 అక్టోబర్, 2025

మడగాస్కర్‌లో జెన్ జెడ్ ఆందోళ‌న‌ల‌తో ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయింది. దేశ‌ అధ్యక్షుడు ఆండ్రీ రాజోయెలినా దేశాన్ని వదిలి వెళ్లాడని ప్రతిపక్ష నాయకుడు, ఇతర అధికారులు సోమవారం వెల్ల‌డించారు. గత కొన్ని వారాలుగా ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్‌ నిరసనలు ప్రభుత్వాలను కుప్పకూల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ త‌ర్వాత‌ రెండోసారి యువత నాయకత్వంలో ఓ దేశ‌ ప్రభుత్వం పడిపోయిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌డ‌గాస్క‌ర్‌లో సెప్టెంబర్ 25 నుంచి మొదలైన నిరసనలు విద్యుత్, నీటి కొరతలతో ప్రారంభమై దోపిడీ, అవినీతి పాలన, ప్రాథమిక సేవల కొరత వంటి పెద్ద సమస్యలపై పోరాటంగా మారాయి. ఈ సంద‌ర్భంగా ప్రతిపక్ష నాయకుడు సిటెనీ రాండ్రియానసోలోనియాయ్కో మాట్లాడుతూ ఆర్మీ నిరసన‌కారులతో చేరిపోయిన తర్వాత రాజోయెలినా ఆదివారం దేశాన్ని వదిలి వెళ్లాడ‌న్నారు. ప్రెసిడెన్సీ సిబ్బందిని అడిగితే, అతను దేశం వదిలి వెళ్లాడని నిర్ధారించార‌ని చెప్పారు. ప్రస్తుత ఆయ‌న ఎక్క‌డున్నార‌న్న సంగ‌తి కూడా తెలియ‌ద‌న్నారు.

ఫ్రెంచ్ సైనిక విమానంలో ప్ర‌యాణం?

రాజోయెలినా ఆదివారం ఫ్రెంచ్ సైనిక విమానంతో దేశాన్ని వదిలి వెళ్లిన‌ట్లు ఒక సైనిక వ‌ర్గం వెల్ల‌డించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో ఒప్పందం కుదుర్చుకుని వెళ్లాడ‌ని ఫ్రెంచ్ రేడియో ఆర్ఎఫ్ఐ తెలిపింది. ఆదివారం మడగాస్కర్‌లోని సైంట్ మేరీ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రెంచ్ ఆర్మీ కాసా విమానం ల్యాండ్ అయింద‌న్నారు. పది నిమిషాల తర్వాత హెలికాప్టర్ వచ్చి, ఓ ప్రయాణికుడిని విమానంలోకి తీసుకెళ్లింద‌ని తెలిపారు. ఆ ప్రయాణికుడు రాజోయెలినాయే అని ఆరోపించారు. సెప్టెంబర్ 25 నుంచి నిరసనలు మొదలయ్యాయి. క్ర‌మంగా వాటి తీవ్రత పెరిగి ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్‌ నిరసనల ప్ర‌భావంతో ఉధృతంగా మారాయి. నేపాల్‌లో ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చినట్లు మొరాకోలో కూడా పాలకులపై నిరసనలు జరిగాయి. రాజోయెలినా 2009లో త‌న‌ను అధికారంలోకి తీసుకొచ్చిన‌ కాప్‌సాట్ అనే ఆర్మీ యూనిట్ మద్దతు కోల్పోయాడు. గ‌త వారాంతంలో కాప్‌సాట్ నిరసన‌కారుల‌తో చేరిపోయి రాజ‌ధాని అంటానానరివోలో వేలాది మందిని రక్షించింది. తర్వాత కొత్త ఆర్మీ చీఫ్‌ను నియమించింది. దీంతో రాజోయెలినా దేశంలో అధికార ఆక్రమణ జరుగుతోందని హెచ్చరించాడు. సోమవారం పారామిలిటరీ గెండార్మరీలోని ఒక వర్గం నిరసన‌కారుల‌ మద్దతుతో గెండార్మరీని ఆక్రమించుకుంది. సీనియర్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఒక అధికారిక వేడుకలో ఇది జరిగిందని అంత‌ర్జాతీయ క‌థ‌నాలు వెల్ల‌డించాయి. నిరసనల్లో ప్రజల ఆగ్ర‌హానికి గురైన సెనేట్ అధ్యక్షుడిని తొలగించారు. తాత్కాలికంగా జీన్ ఆండ్రే ఎన్‌డ్రెమంజారీని నియమించారు. అధ్యక్షుడు లేనప్పుడు ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు సెనేట్ నాయకుడే ఆ పదవిని నిర్వ‌ర్తిస్తాడు.

రాజ‌ధానిలో వేలాది మంది నిర‌స‌న‌

సోమవారం రాజ‌ధానిలో వేలాది మంది గుమిగూడి అధ్యక్షుడు త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. 22 ఏళ్ల హోటల్ కార్మికుడు ఆడ్రియానరివోనీ ఫానోమెగాంట్సోవా గ‌త 16 సంవత్సరాల్లో ప్రజలు పేదల్లా బ‌తుకుతుండ‌గా తన‌ను మాత్రం అధ్య‌క్షుడు ధనవంతుడిగా మార్చుకున్నాడ‌ని విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో జెన్ జెడ్ యువ‌త తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌న్నారు. నిర‌స‌న‌లు మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఘర్షణల్లో కనీసం 22 మంది చనిపోయారని ఐక్య రాజ్య‌ సమితి వెల్ల‌డించింది. సెప్టెంబర్ 25 నుంచి మడగాస్కర్‌లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇందులో కనీసం 22 మంది చనిపోయారని ఐక్య రాజ్య సమితి తెలిపింది. మడగాస్కర్‌లో సగటు వయస్సు 20 ఏళ్ల కంటే తక్కువే, 3 కోట్ల మంది ప్రజల్లో మూడు వంతులు పేదవాళ్లు. 1960లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2020 వరకు ప్రతి వ్యక్తి సగటు ఆదాయం 45 శాతం తగ్గిపోయిందని ప్ర‌పంచ బ్యాంకు చెబుతోంది. ప్రపంచంలోని వానిలా ఎక్కువ భాగం ఇక్కడే పండుతుంది. వానిలా అనేది ఒక సుగంధ ద్రవ్యం. దీనిని సాధారణంగా ఆహార పదార్థాలకు రుచి, వాస‌న‌ చేకూర్చడానికి ఉపయోగిస్తారు. దీంతో పాటు నికెల్, కోబాల్ట్, దుస్తులు, రొయ్యలు వంటి ఎగుమతులు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్నాయి.

ప‌రిపాల‌నంతా అవినీతిమ‌య‌మే

ఆండ్రీ రాజోయెలినా మ‌డ‌గాస్క‌ర్‌ రాజకీయాల్లో రెండు ప్రధాన దశల్లో కీలక పాత్ర పోషించాడు. మొదట 2009–2014 మధ్య తాత్కాలిక నాయకుడిగా, తర్వాత 2019–2023 మధ్య అధికారికంగా ఎన్నికైన అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఇటీవల జెన్ జెడ్‌ నిరసనకారులు అతని పాల‌న‌పై విరుచుకుప‌డ్డారు. ఆండ్రీ రాజోయెలినా మాజీ మీడియా వ్యాపారవేత్త, 2007లో అంటానానరివో మేయర్‌గా ఎన్నికయ్యాడు. అప్పటి అధ్యక్షుడు మార్క్ రవలోమనానాను "డిక్టేటర్" అని ఆరోపించి, 2009లో భారీ ఉద్య‌మం నడిపాడు. సైనిక మద్దతుతో అధికారాన్ని స్వీకరించాడు. ఈ కాలంలో అతడిని తాత్కాలిక అధ్యక్షుడిగా పిలిచారు. ఆండ్రీ పాల‌న‌లో ఆర్థిక సమస్యలు, అవినీతి ఆరోపణలు పెరిగాయి. దీంతో 2013 ఎన్నికలకు పోటీ చేయకుండా వదులుకున్నాడు. అనంత‌రం 2018 ఎన్నికల్లో విజయం సాధించి, 2019లో అధికారిక అధ్యక్షుడయ్యాడు. "ప్లాన్ ఎమర్జెన్స్ మడగాస్కర్" అనే ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికను ప్రవేశపెట్టాడు. కానీ, కోవిడ్‌ మహమ్మారి, 2021 ఆహార సంక్షోభం, తుఫానులు దీన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. 2023లో మళ్లీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధ్యక్షుడయ్యాడు. కానీ ఫ్రెంచ్ పౌరసత్వం ఆరోప‌ణ‌ల వల్ల అర్హతపై వివాదాలు, అన్యాయమైన ఎన్నికల ఆరోపణలు పెరిగాయి. 2023లో ఆండ్రీ ముఖ్య సిబ్బంది లండన్‌లో అవినీతి కేసులో అరెస్టయ్యాడు. ఈ కాలంలో ప్రభుత్వం వానిలా, నికెల్, కోబాల్ట్ ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఈ స‌మ‌యంలో పేదరికం, అవినీతి మ‌రింత పెరిగిపోయాయి.

స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మై యువ‌త తిరుగుబాటు

మడగాస్కర్‌లో 3 కోట్ల మంది ప్రజల్లో 75 శాతం మంది పేదరికంలోనే జీవిస్తున్నారు. 1960లో స్వాతంత్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి 2020 వరకు ప్రతి వ్యక్తి సగటు ఆదాయం 45 శాతానికి తగ్గిపోయింది. యువతకు ఉద్యోగాలు, విద్య అవకాశాలు అంతంత‌మాత్ర‌మే. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్‌లో దేశం వెనుకబడింది. అడవులు 80 శాతం తగ్గాయి. వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని దెబ్బతీశాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు, విద్యుత్, నీరు లేకపోవడం వంటి స‌మ‌స్య‌లున్నాయి. ప్రపంచంలో వానిలా 80 శాతం ఇక్కడే పండుతుంది. కానీ ధరల్లో హెచ్చుతగ్గులు, తుఫానులు దేశ‌ ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. స‌మ‌స్య‌లు, అవినీతి, అసమానతలపై యువ‌త తీవ్ర‌ అసహనానికి గుర‌య్యారు. ఉద్యోగాలు దొర‌క్క‌పోవ‌డం, భవిష్యత్తుపై ఆశలు లేకపోవడం ఉద్య‌మానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2009 తర్వాత ప్రజాస్వామ్యం బలహీనమైందని, రాజోయెలినా ఇచ్చిన అభివృద్ధి హామీలు అమలు కాలేదని యువ‌త ఆగ్ర‌హంతో ఉన్నారు.సోషల్ మీడియా ద్వారా నిరసనలు వేగంగా వ్యాపించాయి. నేపాల్, కెన్యా, ఇండోనేషియా నిరసనల ప్రేరణతో మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. ప్ర‌భుత్వం ర‌ద్ద‌య్యింది. ఈ ఘటనలు మడగాస్కర్‌లో రాజకీయ మార్పుకు మార్గం సుగమం చేస్తున్నాయి. తాత్కాలికంగా సెనేట్ అధ్యక్షుడు జీన్ ఆండ్రే ఎన్‌డ్రెమంజారీ ప‌రిపాల‌న బాధ్య‌త‌లు వ‌హిస్తారు. అంతర్జాతీయంగా ఈ నిరసనలు యువత శక్తిని చూపిస్తున్నాయి.

నేపాల్‌లో ఇటీవల సోష‌ల్ మీడియాపై నిషేధం, ప్ర‌భుత్వ అవినీతికి వ్య‌తిరేకంగా యువత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళ‌న‌లు చేప‌ట్టి ప్ర‌భుత్వాన్ని కుప్ప‌కూల్చారు. శ్రీలంక, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మడగాస్కర్, అర్జెంటీనా దేశాల్లో అదే తరహా ప‌రిస్థితులున్నాయి. పాల‌న‌లో పారదర్శకత లోపం, అవినీతి ఈ నిరసనలు పెరగడానికి ప్రధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. యువత అర్హ‌త లేని రాజకీయ నాయ‌కుల‌పై తిర‌గ‌బ‌డుతున్నారు. అవినీతిని ఎంత‌మాత్రం స‌హించ‌డం లేదు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ అక్ర‌మాల‌ను బయటపెడుతున్నారు. ఉద్యోగాలు, త‌మ‌ ఆర్థిక భవిష్యత్తు కోసం తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. సాంకేతికతతో అవగాహన పెరిగి ప్రభుత్వాలు మారాలని యువ‌త భావిస్తున్నారు. భారత్‌లో సైతం ఇలాంటి నిరసనలు జరిగే అవకాశం ఉందా అంటే సూక్ష్మంగా అవున‌నే చెప్ప‌వ‌చ్చు. కానీ, ఇది భ‌విష్య‌త్తు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భారత్‌లో యువత‌ జనాభా ఎక్కువగా ఉంది. దాదాపు 60 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే ఉన్నారు. దేశంలో సోషల్ మీడియా ప్రభావం సైతం బలంగా ఉంది. ఉద్యోగాలు, విద్య, ఖ‌ర్చులు వంటి సమస్యలు యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ప్ర‌భుత్వంపై నమ్మకం తగ్గుతోంది. భవిష్యత్తులో భారత్‌లో యువత ఆగ్రహం రాజకీయంగా భారీ మార్పులకు దారితీయ‌వ‌చ్చు. కొత్త నాయకులు, పార్టీలు, విధానాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా, కొత్త‌ పార్టీలు పుట్టుకొచ్చినా ఒకే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను దృష్టిలో పెట్టుకొని పాలిస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. రాజ‌కీయ నేత‌లు కేవ‌లం ప‌ద‌వుల కోసం ఆరాట‌ప‌డ‌కుండా యువ‌త‌, దేశ బంగారు భ‌విష్య‌త్తు నిర్మించేందుకు త‌మ‌వంతు కృషి చేయాలి.

మ‌డ‌గాస్క‌ర్‌లో కుప్ప‌కూలిన ప్ర‌భుత్వం - Tholi Paluku