
మడగాస్కర్‌లో ప్రభుత్వంపై తిరుగుబాటు!
మడగాస్కర్‌లో విద్యుత్ కోతలు, నీటి కొరతలపై ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని అంటానానరివోలో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో ప్రజా శాంతిని కాపాడటానికే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. వేలాది మంది యువకులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. నిరసనకారులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా తక్షణమే విద్యుత్ కోతలు నిలిపివేసి, నీటి సరఫరాను పునరుద్దరించాలని కోరారు.
కఠిన చర్యలు తీసుకుంటామన్న అధికారులు
ఈ సందర్భంగా భద్రతా దళాల అధ్యక్షుడు జనరల్ ఏంజెలో రావెలోనారివో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ఆందోళనల ముసుగులో ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రజలు ఆస్తులను రక్షించడానికి సాయుధ దళాలు కర్ఫ్యూ విధించినట్లు చెప్పారు. ప్రజా శాంతి పునరుద్ధరించే వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించారు. ఇండియన్ ఓషన్‌లోని ద్వీప దేశం మడగాస్కార్ పేదరికంలో చిక్కుకొని ఉంది. 2023లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆండ్రీ రాజోఎలినా పాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజులు గడుస్తున్నా పరిస్థితులు మారకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో రాజధానిలోని పెద్ద షాపింగ్ మాల్ లూట్ చేసి కాల్చివేశారు. ఇద్దరు మంత్రుల ఇళ్లు కూడా దోచుకుని ధ్వంసం చేశారు. ఆందోళనకారులు "మాకు నీళ్లు కావాలి, మాకు విద్యుత్ కావాలి" అని నినాదాలు చేస్తూ మార్చ్ నిర్వహించారు. పోలీసులు ముందుగా మార్చ్‌పై నిషేధం విధించినా, యువత దాన్ని ఉల్లంఘించారు. ఆందోళనలు చెదరగొట్టినా తర్వాత రాజధానితో సహా వివిధ ప్రాంతాల్లోకి వ్యాపించాయి. చట్టాన్ని ఉల్లంఘించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
మడగాస్కర్‌లోని ఈ ఆందోళనలు ప్రధానంగా ఆర్థిక, విద్యుత్, నీటి కొరతల కారణంగా ఉద్భవించాయి. ఇవి పేదరికం, ప్రభుత్వ వైఫల్యాలతో ముడిపడి ఉన్నాయి. యువత ఆగ్రహం, హింసాత్మక ఘటనలు ప్రభుత్వం ప్రజల అవసరాలను పరిష్కరించలేకపోతోందని తెలియజేస్తున్నాయి. కర్ఫ్యూ విధించడం తాత్కాలిక పరిష్కారమే అవుతుంది. కానీ ఆర్థిక అసమానతలు, సేవల కొరత పరిష్కార దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు కానరావడం లేదు. ఇటీవల ఫ్రాన్స్, నేపాల్, యూకేలో సైతం ఇలాగే ఆందోళనకు జరిగాయి. ఫ్రాన్స్‌లో మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బడ్జెట్ కోతలు, రాజకీయ అస్థిరతపై ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలో లక్షలాది మంది పాల్గొన్నారు. అరెస్టులు, బస్సులు, రైలు సేవలు నిలిచిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. నేపాల్‌లో "జెన్ జెడ్" ఆందోళనలు సోషల్ మీడియా బ్యాన్, అవినీతిపై ఉద్భవించి ప్రధాని కేపీ శర్మా ఒలీ రాజీనామాకు దారితీశాయి. ఇక్కడ ఆందోళనల్లో 22 మంది మృతి చెందగా, పార్లమెంట్, సుప్రీం కోర్టు వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయి. యూకేలో లక్షకుపైగా ప్రజలు వలసలను వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. దీంతో పోలీసులతో ఘర్షణలు ఏర్పడ్డాయి. ఇటీవల జరుగుతున్న ఆందోళనలన్నీ ప్రపంచవ్యాప్తంగా యువత ఆగ్రహాన్ని స్పష్టం చేస్తున్నాయి. వీటన్నటింకి మూల కారణాలు ఆర్థిక అసమానతలు, అవినీతి, రాజకీయ వైఫల్యాలు అని తెలుస్తోంది. ప్రభుత్వాలు మూల కారణాలపై దృష్టిపెట్టి పరిష్కారాల దిశగా ప్రయత్నించాల్సిన అవసరముంది.
