Let's talk: editor@tmv.in
మెడికల్ కాలేజీల వద్ద వైసీపీ నిరసన

మెడికల్ కాలేజీల వద్ద వైసీపీ నిరసన

FL - SIMHCLM
20 సెప్టెంబర్, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైన కొన్ని మెడికల్ కాలేజీలు మినహా మిగతా వాటిని ప్రైవేటుకు ఇవ్వాలని భావించిన తెలుగుదేశం ప్రభుత్వం మీద నిరసన పెల్లుబుకుతోంది. వైయస్ జగన్ పాలనలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా అందులో ఇప్పటికే ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయి క్లాసులు నడుస్తున్నాయి. ఆ తరువాత ప్రభుత్వం మారిపోవడంతో అవి జగన్ తెచ్చిన కాలేజీలు కాబట్టి తాము ఎందుకు పూర్తి చేయాలి అని భావిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో వాటిని ప్రైవేటుకు ఇవ్వాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా పది కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు ఇస్తామని చెబుతోంది. దీనికిగాను తొలుత ఆదోని, మార్కాపూర్, మదనపల్లె పులివెందుల మొత్తం నాలుగు కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడానికి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఈ అంశాన్ని వైసిపి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని శుక్రవారం చలో మెడికల్ కాలేజీలు అనే ఉద్యమాన్ని చేపట్టింది. తాము మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు వాటిని పూర్తి చేయకుండా ప్రైవేటుకు అమ్మేస్తున్నారన్నది వైసిపి వాదన. ఇందులో భాగంగా అన్ని మెడికల్ కాలేజీల వద్ద వైసిపి యువత విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టింది. చంద్రబాబు లక్షల కోట్ల అప్పు తెచ్చి అదంతా అమరావతిలో పోస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.

జిల్లాల్లోని విద్యార్థి, యువజన విభాగం నాయకులూ కార్యకర్తలు భారీగా కాలేజీల వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బైక్ ర్యాలీ చేయగా పోలీసులు వారిని ఎక్కడికక్కడ నియంత్రించారు. ఏదైనా గానీ అటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ఇలాంటి ఉద్యమం జరగడం ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని అంటున్నారు. మరోవైపు మున్ముందు తాను కూడా ఈ మెడికల్ కాలేజీలను సందర్శించి ప్రభుత్వ కుట్రలను ప్రజలముందుకు తీసుకెళ్తానని వైయస్ జగన్ చెప్పడం ఆ పార్టీ క్యాడర్‌కు మరింత ఊపునిస్తోంది. మొత్తానికి మెడికల్ కాలేజీల వ్యవహారం చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిని తెస్తోంది. కానీ ఈ అంశం మీద వెనక్కి వెళ్ళేది లేదని ఎలాగైనా వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

మెడికల్ కాలేజీల వద్ద వైసీపీ నిరసన - Tholi Paluku