Let's talk: editor@tmv.in
మెడికల్ కాలేజీల రక్షణకు వైసీపీ ఉద్యమం

మెడికల్ కాలేజీల రక్షణకు వైసీపీ ఉద్యమం

FL - SIMHCLM
15 సెప్టెంబర్, 2025

ఏపీలో వైయస్ జగన్ హయాంలో మొదలైన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రకటన రాష్ట్రంలో దుమారం లేపుతోంది. దాన్ని సమర్థించుకునేందుకు టిడిపి యాతన పడుతుండగా బాబును ఇరుకున పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఆయా కాలేజీల వద్ద వైసీపీ ఆందోళనలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పెనుగొండ కాలేజీని సందర్శించారు. తాము మొదలుపెట్టిన కాలేజీలను చేతనైతే పూర్తి చేయాలి కానీ ప్రైవేట్కు ఎలా అమ్ముతారని ఆమె ప్రశ్నించారు. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి ఒప్పుకోం.. ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలతో అడ్డుకుంటాం’ అని అన్నారు.

వైయస్ జగన్ ఆదేశాలతో పెనుకొండలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించిన ఉషశ్రీ చరణ్ అక్కడి పరిస్థితులను గమనించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘వైయస్ జగన్ హయాంలోనే భవనం మూడు అంతస్తులు పూర్తి అయ్యింది. కానీ.. మిగిలిన నిర్మాణం పూర్తి చేయకుండా ప్రైవేటు వ్యక్తులకి చంద్రబాబు అప్పగిస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్వహణలో నీ చేతగానితనాన్ని కవర్ చేసుకోవడానికి పీపీపీ ముసుగు వేస్తున్నావా చంద్రబాబు? జగన్ నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగిస్తూ ప్రజలకు నష్టం చేస్తున్నప్పుడు, ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగతంగా దూషించడం సరైన రాజకీయమా?’ అని ప్రశ్నించారు.

మంత్రి సవిత.. ఇదిగో సాక్ష్యం

‘మా పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే సవిత చూస్తే మొన్నటి రోజు వచ్చి స్విమ్మింగ్ పూల్ కట్టారంటూ డాక్టర్లను హేళన చేసింది. మరి ఇక్కడ మూడంతస్తుల భవనం ఉంది. ఇక్కడి నుంచి దూకితే తెలుస్తుంది. మేము మెడికల్ కాలేజీ కట్టామా? లేదా? అనేది’ అంటూ విరుచుకుపడ్డారు.

‘ఓ సంజీవరెడ్డి గారి సవిత నీకు సంస్కారం లేని సవితా అని పేరు పెట్టాల్సింది. నువ్వు చేసే చిల్లర వేషాలు మొత్తం రాష్ట్రమంతా చూస్తోంది. ఒక మంత్రి స్థానంలో ఉండి చిల్లర మాటలు చిల్లర వేషాలు మానుకో. మా ప్రభుత్వంలో కరువు జిల్లా అయిన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ప్రజల ఆరోగ్యం కోసం దేవాలయం లాంటి మెడికల్ కాలేజీ మేము తెస్తే, దానిని అమ్మడానికి మీరు సిద్ధమయ్యారు’ అని ఉషశ్రీ అన్నారు.

‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేయడానికి ఎన్ని విద్యలు ఉంటే అన్ని విద్యలూ ఉపయోగిస్తున్నారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కట్టాలని అనుకున్నాడా? తొలిసారి ముఖ్యమంత్రి అయినా వైయస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. జగనన్న ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీలే కాకుండా మిగిలినవి కూడా తన సొంతవాళ్లకు అప్పగించేందుకు చంద్రబాబు నీతిమాలిన కుట్ర చేస్తున్నాడు" అని ఉషశ్రీ చరణ్ దుయ్యబట్టారు.

మెడికల్ కాలేజీల రక్షణకు వైసీపీ ఉద్యమం - Tholi Paluku