
“మట్టి వాసన గల గీతాలు రాసిన మన కవి.. అందెశ్రీ”
“జయ జయ హే తెలంగాణా, జనని జయ కేతనమ్…” గీతంతో తెలంగాణ సాహిత్య లోకానికి, ప్రజా కవిత్వానికి అజరామరమైన పేరు అందెశ్రీ. సోమవారం ఉదయం ఆయన హఠాత్తుగా తుదిశ్వాస విడిచారు. తన స్వరంతో, తన సాహిత్యంతో తెలంగాణ ఆత్మను ప్రపంచానికి వినిపించిన ఈ సహజ కవి మరణం సాహిత్యప్రియులను, ఉద్యమకారులను కన్నీటి పర్యంతం చేసింది.
తెలంగాణా నేల కేవలం ఎర్ర మట్టితో కాదు.. ఆ మట్టిలో మానవత్వం, మనసు, మాటలతో పూసిన సహజ కవి ఉండేవారు. ఆయనే ప్రజల హృదయ ధ్వనుల్ని గీతాలుగా మలిచి, తన గేయాలతో తెలంగాణకు ప్రాణం పోసిన అందెశ్రీ. చదువు లేకపోయినా చరిత్రలో నిలిచిపోయిన ఆ సాధకుని మరణం నేడు సాహిత్యలోకం గుండె చెరిపేసిన వార్తగా మారింది. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జీవిత విశేషాల లోతుల్లోకి ఒకసారి వెళదామా…
బాల్యం, బాధల మట్టిలో పుట్టిన పద్యం
1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో అందె ఎల్లయ్యగా జన్మించిన అందెశ్రీ చిన్ననాటి నుంచే కష్టాలకే అలవాటుపడ్డారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి, ఊరి పెద్దల వద్ద పెరిగారు. పాఠశాలకు వెళ్లే అవకాశం రాకపోయినా, జీవితమే ఆయనకు గురువు అయింది. చదువుకన్నా అనుభవమే ఆయనను కవిగా తీర్చిదిద్దింది. గొడ్డలి పట్టిన కూలీగా మొదలైన ఆయన ప్రయాణం, కలం పట్టిన కవిగా మారింది. కష్టజీవుల ఊపిరిని, పల్లెపాలిటి మనసును ఆయన గీతాల్లో పలికించాడు. అనాథ బాల్యంలో కూలీగా జీవిస్తూ చూసిన కష్టాలే ఆయన కలానికి స్ఫూర్తి అయ్యాయి. “జీవితం కవిత్వమవ్వాలి… కవిత్వం జీవితం కావాలి” అని ఆయన నమ్మకం.
ఈయన గొడ్ల కాపరిగా పనిచేసారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం.నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృ గీతం రచించారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు కూడా రాసారు.
మట్టి మనిషి మాటల ప్రతిధ్వని
అందెశ్రీ రచనలు పల్లెల వాసనతో, మనిషి ఆవేదనతో నిండిపోయాయి. “మాయమై పోతుందమ్మ మనిషనవాడు”, “పల్లె నీకు వందనములమ్మో”, “గలగల గజ్జెలబండి” వంటి గీతాలు ఆయన సహజ మనసును ప్రతిబింబించాయి. ప్రతి పద్యంలో ఒక గ్రామం ఊపిరి, ప్రతి గీతంలో ఒక రైతు గుండె చప్పుడు కనిపిస్తాయి. పదాలు ఆయనకు కాగితం మీద రాసినవి కాదు, జీవితంతో వ్రాసినవి. ఆయన రాసిన గీతాలు తాత్విక దృక్పథాన్ని చూపించాయి. ఆ పాటను ఆంధ్ర–తెలంగాణ ప్రాంతాల్లోని విద్యాసంస్థలు పాఠ్యాంశంగా చేర్చాయి. ఆయన గేయాలు ప్రజల్లో చైతన్యం నింపాయి.
తెలంగాణా గీతం – ప్రజల గుండెల్లో మోగిన స్వరం
“జయ జయ హే తెలంగాణా, జనని జయ కేతనమ్…”
ఈ గీతం వినగానే ప్రతి తెలంగాణవాడి మనసు మైమరచిపోతుంది. ఆ గీతాన్ని రాసినవాడు విద్య లేకున్నా జ్ఞానం గలవాడు, అక్షరాలు చదవలేకపోయినా ఆత్మని చదివినవాడు. అదే అందెశ్రీ ప్రత్యేకత. తెలంగాణా ఉద్యమ దశలో ఆయన గీతం ప్రజల రక్తంలో ప్రవహించింది. ఆ గీతమే రాష్ట్ర అధికారిక గీతంగా చరిత్రలో నిలిచిపోయింది.
సినీ పాటల జాబితా
• జయ జయహే తెలంగాణ, తల్లి నీకు వంద…
• పల్లెనీకు వందనములమ్మో
• మాయమై పోతున్నడమ్మో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు
• గలగల గజ్జెలబండి
• కొమ్మ చెక్కితే బొమ్మరా...
• జన జాతరలో మన గీతం
• యెల్లిపోతున్నావా తల్లి
• చూడ చక్కని
• ఆవారాగాడు (సినిమా)
కవిత్వం గుర్తించిన దేశం
అందెశ్రీ తన సాహిత్యంతో ఎన్నో గౌరవాలు అందుకున్నారు.
• “గంగా” చిత్రానికి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు.
• కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందారు.
• అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోకకవి అన్న బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరి 1లో సన్మానించారు.
• వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం (2015 ఆగస్టు 14 న అందుకున్నారు.
• డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (2015 జూలై 5)
• మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించాడు. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు.
• అందెశ్రీకి లోక్ నాయక్ పురస్కారం వరించింది. (ఆంధ్రప్రదేశ్ విశాఖ పట్టణం లోక్ నాయక్ ఫౌండేషన్ వారు ఎన్.టి రామారావు పుణ్యతిథి రోజున గత ఇరువై సంవత్సరం నుండి అవార్డు ఇస్తున్నారు) దీంతో పాటు రెండు లక్షల నగదు బహుమతులు ప్రదానం చేసారు..
• 2022
• లో సుద్దాల హనుమన్–జనకమ్మ అవార్డు పొందారు.
• తాజాగా 2025లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రూ. కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. దానితో పాటు లోక్‌నాయక్ అవార్డు (2025) స్వీకరించారు.
2014లో తెలంగాణ ప్రభుత్వం ఈయనను భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అందుకొనుటకు ప్రతిపాదించింది. ఎర్రసముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు గీతాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు పుస్తకంలో రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకలతో... ఇప్పటికి విద్యాసంస్థలలో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా, ప్రార్థనాగీతంగా పాడుకోవడం విశేషం.
పుస్తకాల్లో కాదు, ప్రజల గుండెల్లో నిలిచిన సహజ కవి
అందెశ్రీ చదువుకున్న కవి కాదు, జీవితం నేర్చుకున్న కవి. ప్రజల భాషలో, పల్లె మాటల్లో రాసిన ఆయన కవిత్వం ఏకంగా పాఠ్యాంశాలుగా మారింది. సహజ కవి గా ప్రజా మనసుకు అద్దం పట్టిన ఆయన ఆలోచనలు ముందు తరానికి ఆదర్శాలు.చదువు లేకపోయినా ఆయన మాటలలో విద్య ఉంది. పుస్తకాలలో కనిపించకపోయినా ఆయన గీతాల్లో జీవితం ఉంది. ఆయన చెప్పినట్టు “మట్టి మీద నడిచిన మనిషే నిజమైన కవి… మట్టిని విన్నవాడే గీతం పాడగలడు.” అందెశ్రీ కవిత్వం పల్లెలో పుట్టి, ప్రజలతో జీవించి, తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.
ఆయన చెప్పినట్టు -* *“నేను రాసింది పుస్తకాల కోసం కాదు... మనిషి మనసు కోసం.”
తెలంగాణ సాహిత్యానికి తీరని లోటు
అందెశ్రీ మరణం తెలంగాణా సాహిత్యానికి తీరని లోటు. కానీ ఆయన గీతాలు మన గుండెల్లో ఇంకా మోగుతూనే ఉంటాయి. ప్రతి రైతు మాటలో, ప్రతి ఊరి గాలిలో, ప్రతి తెలంగాణ పండుగలో ఆయన స్వరం వినిపిస్తుంది. అందెశ్రీ పేరు ఒక్కరికి చెందిందేమో గానీ, ఆయన గీతం మొత్తం తెలంగాణకే చెందింది. ప్రజల ఊపిరి, కవిత్వపు శ్వాస అయిన అందెశ్రీ మరణంతో తెలంగాణ సాహిత్యం ఒక గొప్ప సహజ స్వరాన్ని కోల్పోయింది. అయితే ఆయన రాసిన ప్రతి గీతం, ప్రతి పద్యం ఇప్పటికీ మనకు జీవం పోసే శక్తిగా ఉంది.
“అందెశ్రీ లాంటి కవి మరొకరు రారు”. అని ఆయనను స్మరించుకుంటూ సాహిత్య లోకం నేడు కన్నీటి నివాళి అర్పిస్తోంది.
