Let's talk: editor@tmv.in
మాజీ డీఎస్పీ నళిని మరణ వాంగ్మూలం!

మాజీ డీఎస్పీ నళిని మరణ వాంగ్మూలం!

Venkatesh Balusula
22 సెప్టెంబర్, 2025

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోరాడిన మాజీ డీఎస్పీ నళిని తాజాగా రాష్ట్ర ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ‘‘ఇది నా వీలునామా, మరణ వాంగ్మూలం’’ అంటూ ఆమె ప్రారంభించిన ఓ ఫేస్ బుక్ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చివరి ఆశతో ఈ లేఖ రాశానని పేర్కొన్నారు. నళిని గత ఎనిమిదేళ్లుగా రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ సహా పలు అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు తెలిపారు. అలోపతి మందులకు రియాక్షన్ రావడంతో ఆయుర్వేదం, యోగా, వేదాధ్యయనం వంటి పద్ధతులపై ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్సకు అవసరమైన డబ్బు కూడా లేనంతగా పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నందుకే తనను సస్పెండ్ చేశారని, 12 ఏళ్ల అజ్ఞాతవాసం అనంతరం ఆధ్యాత్మిక మార్గం ద్వారా జీవితం మళ్లీ ప్రారంభించానని వివరించారు. వేద యజ్ఞ పరిరక్షణ సమితి అనే సంస్థను స్థాపించి యజ్ఞబ్రహ్మగా సేవలందించినట్లు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను రాసిన పిటిషన్లు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తన ఫైలు చెత్త బుట్టలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బ్రతికుండగా సబ్సిస్టెన్స్ అల్లోవెన్స్ అయిన రెండు కోట్లు ఇవ్వాలని, వేద విద్యా కేంద్ర స్థాపనకు సహాయం చేయాలని కోరిన పత్రాలపై స్పందన లేదని వాపోయింది. ‘‘నన్ను చనిపోయాక సస్పెండెడ్ ఆఫీసర్ అని కాకుండా, రిజైన్ చేసిన ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ అని పిలవండి’’ అని మీడియాను కోరారు. అంతిమ సంస్కారాలు వైదిక పద్ధతిలో జరగాలని, తన జీవితాన్ని ఎవరూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోరాదని కోరారు. ‘‘ప్రాణాలు నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే బతుకుతాను. లేదంటే ఈ జన్మలో ఇంకెన్నో కోరికలు అసంపూర్తిగా మిగిలిపోతాయి’’ అంటూ తన తుది మనోభావాలను లేఖ ద్వారా వ్యక్తం చేసింది. నళిని బహిరంగ లేఖ ఉద్యమకారులను, ప్రజలను, యువతను ఆలోచింపచేస్తోంది. ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని కోల్పోయిన అధికారిణికి ఇలాంటి పరిస్థితి రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం పోరాడినందుకే ఉద్యోగం కోల్పోయినా, ఆమెకు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత గుర్తింపు దక్కకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా నళిని వినతులపై స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

మాజీ డీఎస్పీ నళిని మరణ వాంగ్మూలం! - Tholi Paluku