
మచిలీపట్నం పోర్టుకు జాతీయ రహదారి అనుసంధానం
ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో పోర్టు ఆధారిత అభివృద్ధికి కీలకమైన మచిలీపట్నం (బందరు) పోర్టును జాతీయ రహదారి నెట్‌వర్క్‌తో నేరుగా అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.573.77 కోట్ల వ్యయంతో 6 లైన్ల ఎక్స్‌టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్–216 కూడలి నుంచి ఎన్‌హెచ్–216లోని మచిలీపట్నం బైపాస్ మీదుగా పోర్టుకు నేరుగా చేరేలా ఈ ప్రత్యేక రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారి కారిడార్ నుంచి పోర్టుకు నిరాటంకంగా, వేగవంతమైన కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు కేంద్రం వెల్లడించింది.
ఆధునిక మౌలిక వసతులు
ఈ ప్రాజెక్టులో ఆరు లైన్ల ప్రధాన రహదారితో పాటు రెండు వైపులా సర్వీస్ రోడ్లు, మూడు కీలక ఫ్లైఓవర్లు, ఒక ఓవర్‌పాస్-కమ్-రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా ఉంది. ఈ మౌలిక వసతులు పూర్తయితే మచిలీపట్నం పోర్టు నుంచి దేశంలోని ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలకు సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. ఫ్రైట్ టర్న్ అరౌండ్ టైమ్ తగ్గడంతో పాటు లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
కేంద్రానికి ప్రతిపాదనలు – తాజా ఆమోదం
ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్–216లను మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించే డెడికేటెడ్ రహదారి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి పంపింది. అయితే సాంకేతిక అనుమతులు, భూసేకరణ అంశాల కారణంగా ప్రాజెక్టు కొంత ఆలస్యమైంది. సాగరమాల, పోర్ట్-లెడ్ డెవలప్‌మెంట్ విధానాల కింద పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వడంతో తాజాగా ఈ ప్రతిష్టాత్మక రహదారికి నిధులు మంజూరయ్యాయి.
సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
మచిలీపట్నం ఓడరేవును జాతీయ రహదారి నెట్‌వర్క్‌తో నేరుగా అనుసంధానించే ఆరు లేన్ల బాహ్య రహదారి నిర్మాణానికి రూ.570 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నెట్‌వర్క్ అభివృద్ధికి గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల కనెక్టివిటీపై కేంద్రం చూపుతున్న దృష్టి ఆనందాన్ని కలిగిస్తోంది అని నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.
పోర్టు ఆధారిత అభివృద్ధికి ఊతం
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అదనపు పోర్టు మౌలిక సదుపాయాల అవసరం పెరిగిన నేపథ్యంలో మచిలీపట్నాన్ని గ్రీన్‌ఫీల్డ్ పోర్టుగా అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. పోర్టు అభివృద్ధితో పాటు సమర్థవంతమైన రహదారి అనుసంధానం అవసరమన్న దృష్టితో రూపొందించిన ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది.
ఈ కనెక్టివిటీ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు–దిగుమతులు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా సహా పరిసర కోస్తా ప్రాంతాల్లో పోర్టు ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్‌లు ఏర్పడేందుకు ఇది దోహదం చేస్తుందని, తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన వాణిజ్య–తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ రహదారి కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
