Let's talk: editor@tmv.in
మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

Panthagani Anusha
24 మార్చి, 2026

కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని జిల్లా కోర్టుకు సోమవారం ఉదయం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి జిల్లా న్యాయమూర్తికి వచ్చిన ఈ సందేశం ఒక్కసారిగా కోర్టు వర్గాలను, పోలీసు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. కోర్టు ప్రాంగణంలో పేలుడు పరికరాన్ని అమర్చినట్లు ఆ మెయిల్‌లో పేర్కొనడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి కోర్టు ప్రాంగణం అంతటా ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. భద్రతా కారణాల దృష్ట్యా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో పాటు కక్షిదారులను వెంటనే ప్రాంగణం వెలుపలికి పంపించివేశారు. ప్రధాన భవనం, కోర్టు హాళ్లు, రికార్డు గదులు,పరిసర ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు.

సుమారు గంటల తరబడి సాగిన క్షుణ్ణమైన సోదాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపును తప్పుడు సమాచారం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇదిలాఉండగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో కోర్టులను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి ఈ-మెయిల్ బెదిరింపులు రావడం గమనార్హం.ఇక ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, మెయిల్ పంపిన నిందితుడిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం ద్వారా దర్యాప్తును వేగవంతం చేశారు. తప్పుడు సమాచారంతో ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.