
మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి విస్తరణపై మంత్రి జనార్థన్ రెడ్డి సమీక్ష
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి శుక్రవారం సచివాలయంలోని ఆర్&బి కార్యాలయంలో మచిలీపట్నం - విజయవాడ నేషనల్ హైవేను ఆరు లైన్లకు పెంచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రూపొందించిన డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక)పై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఇటీవల నిర్వహించిన స్టేక్ హోల్డర్ల సమావేశంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల నుంచి వివరణ కోరారు.
ముఖ్యంగా ప్రతిపాదిత డీపీఆర్‌లో బెంజి సర్కిల్ నుండి భవిష్యత్తులో రాబోయే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు ఎక్కడా అండర్ పాస్లు లేదా ఫ్లై ఓవర్ల ప్రస్తావన లేకపోవడంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లోపాన్ని సరిదిద్దే క్రమంలో స్థానికంగా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించాలని ఆయన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా విజయవాడ నుంచి పెనమలూరు వరకు భవిష్యత్తులో మెట్రో రైలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, అందుకు అనుగుణంగా ఆరు లైన్ల రహదారిని డబుల్ డెక్కర్ నిర్మాణంగా ప్రతిపాదించాలని ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు చేసిన సూచనను కూడా పరిగణలోకి తీసుకోవాలని మంత్రి జనార్థన్ రెడ్డి సూచించారు. ఎన్‌హెచ్‌ఏఐ విజయవాడ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్, ప్రతిపాదిత డీపీఆర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రికి వీడియో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
