
ముఖ్యమంత్రికి అగ్నిపరీక్ష!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రస్తుతం పరీక్షా సమయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన ముందున్న సవాళ్లు . ఈ రెండు గండాలను ఆయన గట్టెక్కాల్సి ఉంది. కాంగ్రెస్ పాలనకు కూడా ఈ ఎన్నికలే పరీక్ష. ముఖ్యమంత్రి పనితీరును కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఎన్నిక ఆధారంగా అంచనా వేసే అవకాశం ఉంది. మరి ఈ గండాలను రేవంత్ రెడ్డి ఎలా గట్టెక్కుతారో వేచి చూడాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ సానుభూతి కార్డును వాడుతోంది. మాగంటి సతీమణిని రంగంలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలో అంతర్గతంగా అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పల్లెల్లో ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. యూరియా కొరత విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని బద్నాం చేయాలని చూసినా ప్రజలు పెద్దగా నమ్మినట్టుగా కనిపించడం లేదు. అనేక చోట్ల ప్రతి నిత్యం యూరియా కోసం రైతులు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? ఆయనకు సీనియర్ నేతలు సహకరిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.
ఉపఎన్నిక ఎంతో ప్రతిష్ఠాత్మకం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఈ స్థానంలో అభ్యర్థిని ఎంపిక చేయడం.ఎన్నికలో అవలంభించే వ్యూహం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో ముఖ్యం. మాగంటి గోపీనాథ్ జూన్ 8న మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం అవుతోందన్న చర్చ జరుగుతోంది. నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ కొందరు సీనియర్ల నుంచి అభ్యంతరాలు ఉన్నట్టు సమాచారం. మరి ఏఐసీసీ మదిలో ఏముందో తేలాల్సి ఉంది. పార్టీలోని వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాల వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికపై దృష్టి పెట్టి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్ల చైర్మన్లతో ఈ ఎన్నికకు సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు.
బీఆర్ఎస్ దూకుడు
మరోవైపు బీఆర్ఎస్ త్వరగా అభ్యర్థిని ప్రకటించి, అంతర్గత ప్రచారం మొదలుపెట్టింది. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ఎంపిక చేసిన బీఆర్ఎస్, యువత, మహిళలు, మైనారిటీల మద్దతు తమకే ఉందని చెబుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలు ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు. కేసీఆర్ మీద కాళేశ్వరం కమిషన్ విచారణ, కేటీఆర్ మీద ఈ కార్ రేసు విచారణ వంటి అంశాలు గులాబీ పార్టీ మీద ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కవిత తన తరఫున మరో అభ్యర్థిని నిలబెడితే బీఆర్ఎస్ కు ఇబ్బందే. మరి ఈ సవాళ్లను బీఆర్ఎస్ కూడా ఎదుర్కోవాల్సి ఉంది. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత ముఖ్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలచుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీకి ఈ ఉప ఎన్నిక అత్యంత ముఖ్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది. బీజేపీ కూడా పోటీలో ఉంటే ఇక్కడ త్రిముఖ పోరు తప్పదు. అయితే బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు కూడా అత్యంత కీలకం. బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కావడం, సెంటిమెంట్ కలిసివస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడం బీఆర్ఎస్‌కు అంత తేలిక కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
ఓటర్ల సంఖ్య ఎంత?
2025 ఉప ఎన్నికల డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకారం మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు (పురుషులు: 2,04,288 మంది మహిళలు 1,88,356 మంది ఇతరులు 25 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 34 శాతం మంది మైనార్టీ ఓటర్లే ఉన్నట్టు సమాచారం. వీరి ఓట్ల సంఖ్య 1,32,591 మంది అని ఒక అంచనా. దీంతో జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓట్లు కీలకం. బస్తీలు, మైనారిటీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి సంబంధించి మజ్లిస్ మద్దతు ఎంతో కీలకం. గత ఎన్నికల సమయంలో మజ్లిస్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలతో మజ్లిస్.. కాంగ్రెస్ వైపు నిలిచే అవకాశం ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో మజ్లిస్ పాత్ర ఎంతో కీలకం. మజ్లిస్ మద్దతు ఇచ్చే వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు మరో సవాల్
తెలంగాణలో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు సెప్టెంబర్ 30 నాటికి జరపాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కోటా విధానం, గ్రామీణ అసంతృప్తి కారణంగా ఆలస్యం చేస్తోంది. పంచాయతీరాజ్ (సవరణ) బిల్ 2025 ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను నిర్ధారించినప్పటికీ, ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలు కాస్త భిన్నంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి? గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాలు ఎంతో అండగా నిలిచాయి. ఆరు గ్యారెంటీలు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు కొంత మారిపోయినట్టు కనిపిస్తోంది. యూరియా కొరత, హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. మరి ఈ సవాల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. సెప్టెంబర్ 2025లో తెలంగాణ రైతులు యూరియా కొరతతో సతమతమవుతున్నారు. ఖరీఫ్ సీజన్‌కు 10.48 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉన్నప్పటికీ, సరఫరా లోపిస్తోంది. ఈ రెండు సవాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థంగా ఎదుర్కుంటే ఆయనకు అధిష్ఠానం వద్ద మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సవాళ్లను ఎదుర్కొంటారా? లేదంటే చతికిల పడతారా? అన్నది వేచి చూడాలి.
