
మొక్కజొన్నపై అమెరికా అసహనం
ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాలు విధిస్తున్నారు. ఫలితంగా భారత్ లాంటి దేశాలు ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం వెతుకుతున్నాయి. చాలా దేశాలపై సుంకాలు విధించి ట్రంప్ ఇబ్బందిపెడుతున్నారు. ఇప్పుడు అమెరికాకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ విధానాలతో అమెరికానే ఇబ్బందుల్లో పడింది. ఎలాంగంటే మొక్కజొన్న ఉత్పత్తిలో అమెరికాది అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానం భారత్ ది. అమెరికా పండించిన మొక్కజొన్నలో ఎక్కువ భాగాన్ని చైనా కొనుగోలు చేసేది. కానీ చైనాపై అమెరికా సుంకాలు విధించడంతో చైనా అమెరికా నుంచి మొక్కజొన్న కొనుగోలు తగ్గించింది. ఫలితంగా అమెరికా ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చూడాల్సి వచ్చింది.
చైనా తర్వాత పెద్ద మార్కెట్ ఇండియాది. అందుకే ఇండియాను తమ మొక్కజొన్న కొనుగోలు చేయాలని అమెరికా కోరుతోంది. కానీ ఇండియాకు సరిపడా మొక్కజొన్న ఉత్పత్తి దేశీయంగా ఉంది. ఇలాంటి సందర్బంలో అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అవసరానికి సరిపడా ఉత్పత్తి ఉన్న నేపథ్యంలో ఇండియా అమెరికా నుంచి నామమాత్రంగా మొక్కజొన్న కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు ట్రంప్ విధించిన 50శాతం సుంకాల కారణంగా 0.5 మిలియన్ టన్నులు మాత్రమే దిగుమతి చేసుకోగలదు. అదే సమయంలో జన్యుమార్పులు చేసిన మొక్కజొన్న కొనుగోలుకు భారత ప్రభుత్వం ఒప్పుకోవడంలేదు.
140 కోట్ల భారత జనాభా.. కొంతైనా తమ మొక్కజొన్న కొనుగోలు చేయరు అంటూ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ అసహనం వ్యక్తం చేశారు. దీనికి కారణం చైనా కొనుగోలు తగ్గించడం. ప్రత్యా మ్నాయ మార్కెట్ల వైపు అమెరికా చూడాల్సి రావడం. భారత్ లో మొక్కజొన్న వినియోగం పెరుగుతుందని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకే తమ ఉత్పత్తి కొనాలన్నది అమెరికా కోరిక. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత మార్కెట్ లో పాగా వేయాలన్నది అమెరికా ప్రణాళిక. కానీ అమెరికాలో ఎక్కువగా జన్యుమార్పిడి మొక్కజొన్ననే పండిస్తారు.
వీటిని ఇండియా దిగుమతి చేసుకోదు. అదే సందర్బంలో మనదేశంలో అవసరానికి సరిపడా ఉత్పత్తి ఉంది. ఒకవేళ అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలమయ్యి, కొనుగోలు చేసినా.. వాటిని ఇథనాల్ ఉత్పత్తికి మాత్రమే వాడాలన్నది నీతి ఆయోగ్ సూచన. పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండింగ్ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానం. ఇలాంటి సందర్భంలో ఇథనాల్ తయారీకి మొక్కజొన్న అవసరం ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి డిమాండ్ తగ్గ స్థాయిలో లేకపోతే అమెరికా నుంచి కొనుగోలు చేయవచ్చు. అమెరికా- ఇండియా మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో మొక్కజొన్న అంశాన్ని అమెరికా వ్యూహాత్మకంగా తెరమీదకి తెచ్చింది.
