
మంథన్ - లైఫ్ సైన్సెస్, క్లినికల్ రీసెర్చ్ రంగంలో భారత్ సరికొత్త ముందడుగు
భారతదేశ క్లినికల్ రీసెర్చ్, లైఫ్ సైన్సెస్ ఆద్వర్యంలో పరిశోధన, అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహించిన 'మంథన్ 2026' సదస్సు ముంబైలో ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫార్మా నాయకులు, శాస్త్రవేత్తలు, విధానకర్తలు, రెగ్యులేటరీ నిపుణులు ఈ వేదికపై చర్చలు జరిపి, భారతదేశాన్ని ప్రపంచ పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు.
సదస్సు నేపథ్యం:
డయాగ్నోసెర్చ్ లైఫ్ సైన్సెస్ సహకారంతో, వాసుస్ ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహించింది. దివంగత డాక్టర్ వాసుదేవ్ గిండే విజన్‌ను ముందుకు తీసుకెళ్తూ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాల్లో జ్ఞాన మార్పిడిని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
"మారుతున్న లైఫ్-సైన్సెస్ ఆర్&డి దృశ్యంలో భారతదేశం" అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో నాలుగు కీలక అంశాలపై దృష్టి సారించారు. అందులో ముఖ్యంగా ఆవిష్కరణల వేగం పెంచి భారతీయ లైఫ్ సైన్సెస్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, నెక్స్ట్-జెన్ థెరప్యూటిక్స్ లో భాగంగా భవిష్యత్ చికిత్సా పద్ధతులైన ఎమ్ఆర్ఎన్ఏ సెల్, జీన్ థెరపీల వినియోగం, భారతదేశంలో విస్తృతంగా ఉండే నిర్లక్ష్యం చేయబడిన వ్యాధులపై పరిశోధనలను వేగవంతం చేయడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అత్యాధునిక మౌలిక వసతుల కల్పన వంటివి ఉన్నాయి.
ప్రముఖుల విశ్లేషణ:
డయాగ్నోసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ మట్టూ మాట్లాడుతూ, పరిశ్రమలు విద్యా సంస్థల మధ్య సమన్వయం ద్వారా మాత్రమే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశోధనలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
డాక్టర్ మనీషా గిండే మాట్లాడుతూ, మంథన్ కేవలం ఒక సదస్సు మాత్రమే కాదని, ఇది భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగంలో సానుకూల మార్పు కోసం చేస్తున్న సమిష్టి ప్రయత్నమని అన్నారు.
అలాగే శాస్త్రీయమైన, నైతికమైన, అంతర్జాతీయ రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా పరిశోధనలు నిర్వహించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. 30 ఏళ్ల అనుభవం ఉన్న డయాగ్నోసెర్చ్ వంటి సంస్థలు ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు కొనియాడారు. ఈ సదస్సు భారతదేశాన్ని గ్లోబల్ ఆర్ &బి హబ్‌గా మార్చడంలో ఒక మైలురాయిగా నిలవనుంది.
