
మంత్రి వీణా జార్జ్‌పై దాడి..కేరళలో రాజకీయ ఉద్రిక్తత
కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ పై కన్నూర్‌లో దాడి జరిగినట్లు చెబుతున్న ఘటనపై రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆమెకు గాయాలై ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు, సీపీఐ నేత పీ. సందోష్ కుమార్ మాట్లాడుతూ, పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం నిరాశతో మంత్రులపై దాడులకు కూడా దిగుతోందని విమర్శించారు. కేరళలో రాజకీయ నిరసనలు సహజమే. కానీ ప్రతి విషయానికీ హద్దు ఉండాలి. మంత్రి వీణా జార్జ్‌పై దాడి అంగీకారయోగ్యం కాదు. ఇప్పుడు మొత్తం కేరళ యూడీఎఫ్‌కు వ్యతిరేకంగా నిలుస్తోందని ఆయన అన్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సమాజాన్ని విభజించి మళ్లీ అధికారాన్ని సాధించేందుకు జమాత్-ఏ-ఇస్లామీ, ఎస్‌డీపీఐ వంటి మతపరమైన శక్తులతో చేతులు కలుపుతోందని ఆయన ఆరోపించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ ఈ దాడిని ‘పూర్తిగా ప్రణాళికాబద్ధమైన దాడి’గా పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వానికి పూర్తి అవగాహనతోనే ఇది జరిగిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు. మరోవైపు(సీపీఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ కూడా ఈ దాడిని ఖండిస్తూ, ప్రజాప్రతినిధులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలని కోరారు.
అంతా డ్రామా
ఇదిలా ఉండగా కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ ఈ దాడి ఆరోపణలను పూర్తి నాటకంగా కొట్టిపారేశారు. దాడి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. వీడియోల్లో ఎవరూ ఆమెను తాకినట్లు కనిపించదు. ఇది కల్పిత కేసు మాత్రమే అని ఆయన అన్నారు. ఈ ఘటన కన్నూర్ రైల్వే స్టేషన్‌లో బ్లాక్ ఫ్లాగ్ నిరసన సందర్భంగా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్‌యూ) మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టింది.
ఈ సంఘటన తర్వాత ఎల్‌డీఎఫ్ కార్యకర్తలు అదూర్‌లో యూత్ కాంగ్రెస్ జెండాలు, పోస్టర్లు ధ్వంసం చేశారు. ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘పుతు యుగ యాత్ర’ పోస్టర్లను కూడా చించివేశారు. కన్నూర్ టౌన్ పోలీసులు కేఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎంసీ అతుల్ సహా ఐదుగురు నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో, సీపీఎం విద్యార్థి విభాగం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంపై ర్యాలీ నిర్వహించి నినాదాలు చేసింది. రాళ్లు విసిరిన ఘటనలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ స్పందిస్తూ, రాష్ట్రాన్ని ఘర్షణ ప్రాంతంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మన రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
