Let's talk: editor@tmv.in
మంత్రి నారా లోకేష్ ఫొటోతో సైబర్ వల

మంత్రి నారా లోకేష్ ఫొటోతో సైబర్ వల

Panthagani Anusha
31 అక్టోబర్, 2025

ప్రస్తుతం సైబర్ నేరాలు రాష్ట్రంలో శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా నేరగాళ్లు కొత్త రకాల పద్ధతులతో వ్యవహరిస్తుండటంతో ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖుల పేర్లు, ఫోటోలు వాడి ప్రజలను నమ్మించే ఘటనలు రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి మోసానికి సంబంధించిన మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది.

ఏపీ మంత్రి నారా లోకేష్ ఫొటోను తమ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా (డీపీగా) ఉపయోగించి, ప్రజల నుంచి ఏకంగా రూ. 54.34 లక్షలు అక్రమంగా వసూలు చేసిన ముగ్గురు సైబర్ నేరగాళ్ల ముఠాను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అత్యవసర వైద్య పరీక్షలు లేదా ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసానికి పాల్పడటం గమనార్హం. ముఖ్యంగా X (గతంలో ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమంలో ఆర్థిక సాయం కోసం ప్రముఖుల ఖాతాల కింద సహాయం కోరిన వారిని ట్రాప్ చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ మోసంలో ప్రధాన నిందితుడు, కొండూరి రాజేష్ నారా లోకేష్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని, తాను టీడీపీ ఎన్నారై కన్వీనర్ అంటూ బాధితులకు నమ్మకంగా పరిచయం చేసుకునేవాడు. బాధితులను తమ మాయమాటలతో లొంగదీసుకున్న తర్వాత భారీ మొత్తంలో ఉదాహరణకు రూ. 10 లక్షల సాయం పంపుతున్నట్లుగా నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు పంపి, తమ వలలో పడేసుకునేవాడు. కొద్ది రోజుల తర్వాత, ఆ డబ్బులు వారి ఖాతాలో జమ కావాలంటే, నాలుగు శాతం రెమిటెన్స్ చార్జెస్ కట్టాలంటూ తిరిగి బాధితుల నుంచి డబ్బు వసూలు చేసేవారు. ఈ రకంగా సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని, ఈ ముఠా భారీ మొత్తాన్ని కాజేసింది.

ఇక ఈ సైబర్ మోసానికి పాల్పడిన నేరగాళ్ళను సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో సాయి శ్రీనాథ్, సుమంత్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక మోసంలో కీలక పాత్ర పోషించిన రాజేష్‌ను పోలీసులు గతంలోనే అరెస్టు చేశారు. అతను అందించిన సమాచారంతోనే మిగతా నిందితుల వివరాలు బయటపడ్డాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 9 కేసుల్లో ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రజలను హెచ్చరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఆర్థిక సహాయ అభ్యర్థనలు లేదా హామీలను నమ్మే ముందు తప్పనిసరిగా వాటి ప్రామాణికతను ధృవీకరించుకోవాలని సీఐడీ అధికారులు సూచిస్తున్నారు.

మంత్రి నారా లోకేష్ ఫొటోతో సైబర్ వల - Tholi Paluku