

మంత్రి జూపల్లి కృష్ణారావుకు అంతర్జాతీయ “శాంతి” పురస్కారం
హైదరాబాద్‌లోని హరిథా ప్లాజాలో జరిగిన “ఇంటర్నేషనల్ బౌద్ధ పీస్ కాన్ఫరెన్స్-2026” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ప్రపంచ శాంతి స్థాపనలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ ఇంటర్‌చేంజ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకమైన ‘గ్రాండ్ ప్రైజ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు వరల్డ్ పీస్’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు మూన్ యోంగ్ జో అందించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ యుద్ధాలు, విభేదాలు పెరుగుతున్న ఈ రోజుల్లో గౌతమ బుద్ధుడు బోధించిన కరుణ, అహింసలే మానవజాతిని రక్షించే ఏకైక మార్గమని పేర్కొన్నారు. బౌద్ధ బోధనలు నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా సమాధానాలు చూపుతున్నాయని అన్నారు.
పురస్కారాన్ని స్వీకరిస్తూ ఆయన, ఈ గౌరవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వానికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి, సహనం, అహింస వంటి విలువలకు కట్టుబడి పనిచేస్తోందని ఈ పురస్కారం ప్రతిఫలిస్తోందని అన్నారు.
తెలంగాణ బౌద్ధ వారసత్వాన్ని ప్రస్తావించిన మంత్రి శతాబ్దాలుగా ఈ భూభాగం బౌద్ధ విద్యకు ఒక ప్రముఖ కేంద్రంగా నిలిచిందని గుర్తుచేశారు. కృష్ణానది తీరాల్లో అచార్య నాగార్జున మహాయాన బౌద్ధంలో మధ్యమిక సిద్ధాంతం, శూన్యత తత్వాన్ని ప్రతిపాదించి ఈ ప్రాంతాన్ని ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా మార్చారని తెలిపారు. ఫణిగిరి, నెలకొండపల్లి, ధూలికట్ట వంటి ప్రాంతాలు పురావస్తు స్థలాలు మాత్రమే కాకుండా మన మహోన్నత నాగరికతకు ప్రతీకలని వివరించారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణను ప్రపంచ బౌద్ధ పర్యాటకపటంలో ముందంజలో నిలపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. నాగార్జున సాగర్ సమీపంలోని 274 ఎకరాల బుద్ధవనం ప్రాజెక్ట్‌తో పాటు, ఫణిగిరి, నెలకొండపల్లి, ధూలికట్ట, కొటిలింగల వంటి కీలక వారసత్వ ప్రాంతాలను సంరక్షించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను రూపొందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ సదస్సు ద్వారా ప్రపంచ శాంతి సాధనకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని మంత్రి నమ్మకం వ్యక్తం చేశారు.
సదస్సుకు శ్రీలంక బుద్ధశాసన మంత్రి ప్రొఫెసర్ హినిడుమ సునిల్ సేనేవి, వియత్నాం ప్రతినిధి డాక్టర్ థిచ్ నాట్ టూ, బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు, సదస్సు కన్వీనర్ శివనాగి రెడ్డి సహా 22 దేశాల నుంచి వచ్చిన 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
