Let's talk: editor@tmv.in
మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డు

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డు

Panthagani Anusha
6 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. సమాజ సేవలో ఆయన కనబరుస్తున్న చొరవను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుని పేరుతో ఇచ్చే ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వ్యాపార ప్రతిపాదన సంస్థ యూ.ఎస్-ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ మంత్రి విశేష సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించింది.

పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట

రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలను బలోపేతం చేయడం ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో మంత్రి శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయాలు ఈ అవార్డుకు ప్రధాన కారణమని కౌన్సిల్ పేర్కొంది. సెర్ప్ ద్వారా గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానం చేయడంలో ఆయన పోషించిన పాత్రను కౌన్సిల్ సీఈఓ, ప్రెసిడెంట్ ఎలీషా బి.పులివర్తి కొనియాడారు. ఈ మేరకు బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మంత్రికి పురస్కారాన్ని అందజేశారు.

పెట్టుబడుల దిశగా కీలక ఒప్పందం

పురస్కార ప్రదానోత్సవం అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యూఎస్-ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్‌కు మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికాలోని పెట్టుబడులను అత్యాధునిక సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడమే కాకుండా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల (ఎన్ఆర్ఐ) భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి మార్గం సుగమం కానుంది.

ఈ కార్యక్రమంలో యూఎస్-ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె. శ్రీహరి, ఏపీ ఎం.ఎస్.ఎమ్.ఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ విశ్వ మనోహరన్, ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు డాక్టర్ ఎమ్. శ్రీనివాస శంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డు - Tholi Paluku