

మంత్రి కందుల దుర్గేష్ హస్తిన పర్యటన సక్సెస్
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ఆరంభంలోనే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఆయన నివాసంలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను సమర్పించారు.
రూ. 915 కోట్లతో 9 కొత్త ప్రాజెక్టులు
రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా మంత్రి దుర్గేష్ సుమారు రూ. 915 కోట్ల విలువైన 9 కొత్త పర్యాటక ప్రాజెక్టులను కేంద్రం ముందు ఉంచారు. స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్, శాస్కి పథకాల కింద ఈ నిధులను మంజూరు చేయాలని కోరారు. ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఆధ్యాత్మిక సర్క్యూట్‌ల బలోపేతం ద్వారా ఏపీని పర్యాటక హబ్‌గా మార్చడమే ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశ్యం.
ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట
ప్రసాద్ స్కీమ్ కింద రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి నిధులు కోరారు. ఇందులో భాగంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రూ. 95.18 కోట్లు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి రూ. 213.72 కోట్లు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు నెల్లూరు గృహ మల్లేశ్వర స్వామి ఆలయం (రూ. 48.95 కోట్లు), కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (రూ. 36 కోట్లు), మరియు వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి (రూ. 120 కోట్లు) నిధులు కేటాయించాలని కోరారు.
బీచ్ టూరిజం, హిల్ స్టేషన్ల అభివృద్ధి
మచిలీపట్నంలో వైబ్రెంట్ బీచ్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం స్వదేశ్ దర్శన్ 2.0 కింద రూ. 120.04 కోట్ల నిధులను మంత్రి అభ్యర్థించారు. అలాగే, 'ఆంధ్రా ఊటీ'గా పేరుగాంచిన లంబసింగిలో పర్యాటక అనుభూతిని మెరుగుపరిచేందుకు రూ. 99.87 కోట్లు, రాష్ట్రంలోని ప్రధాన బౌద్ధ క్షేత్రాల వద్ద టెంట్ సిటీల ఏర్పాటుకు మరో రూ. 77.32 కోట్లు మంజూరు చేయాలని కోరారు. లేపాక్షిలో సాంస్కృతిక మౌలిక సదుపాయాల కోసం రూ. 103.05 కోట్ల ప్రతిపాదనలను కేంద్రానికి వివరించారు.
అమరావతిలో పర్యాటక భవన్,ఎన్ఐహెచ్
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఏర్పాటుకు మంత్రి మద్దతు కోరారు. శీలా భిడే కమిటీ సిఫార్సుల మేరకు అమరావతిలో రూ. 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌పీరియన్స్, ఇంటర్ ప్రిటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (పర్యాటక భవన్) నిర్మించాలని విన్నవించారు. తిరుపతి, విశాఖపట్నంలను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్లుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలుగు భాషా వైభవం - సూర్యరాయ నిఘంటువు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు 'సూర్యరాయ నిఘంటువు' పునర్ముద్రణపై కేంద్రమంత్రితో కీలక చర్చలు జరిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న సూత్రప్రాయ అంగీకారాన్ని త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలని కోరారు. తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పేందుకు, సాహిత్య పరిరక్షణకు కేంద్రం తోడ్పాటు అవసరమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ చెప్పారు.
సాంస్కృతిక పునరుజ్జీవం కళాక్షేత్రాలు
రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకు స్థల పరిశీలన పూర్తయిందని, త్వరగా ఆమోదించాలని కోరారు. అలాగే విశాఖపట్నంలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం, విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో 'కళాక్షేత్ర' ఆడిటోరియం నిర్మాణం, ఏపీలో సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు వంటి 6 సాంస్కృతిక ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ బ్రాంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మేరకు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే పురోగతిలో ఉన్న రూ. 430 కోట్ల విలువైన ప్రాజెక్టుల వివరాలను కూడా కేంద్రానికి వివరించారు. పర్యాటక మంత్రి విన్నపాలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించడంతో, ఏపీ పర్యాటక రంగం త్వరలోనే సరికొత్త రూపురేఖలు సంతరించుకోనుంది.
