Let's talk: editor@tmv.in
మంత్రి కందుల దుర్గేష్ హస్తిన పర్యటన: రూ. 430 కోట్ల ప్రాజెక్టులపై కీలక చర్చలు

మంత్రి కందుల దుర్గేష్ హస్తిన పర్యటన: రూ. 430 కోట్ల ప్రాజెక్టులపై కీలక చర్చలు

Dantu Vijaya Lakshmi Prasanna
2 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ఈ పర్యటన అత్యంత కీలకంగా మారింది. ఈరోజు ఉదయం 10 గంటలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో మంత్రి దుర్గేష్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పర్యాటక ప్రాజెక్టులకు మోక్షం కలిగించడంతో పాటు, కొత్తగా ప్రతిపాదించిన 9 భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు.

భారీ నిధుల విజ్ఞప్తి - ఆలయాల అభివృద్ధి

మంత్రి దుర్గేష్ ఈ పర్యటనలో ప్రధానంగా 'ప్రసాద్' స్కీమ్ కింద రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రూ. 95.18 కోట్లు, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి రూ. 213.72 కోట్లు, కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రూ. 36 కోట్లు, వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 120 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి డీపీఆర్ లు సమర్పించనున్నారు. వీటితో పాటు నెల్లూరులోని శ్రీ గృహ మల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 48.95 కోట్లు కోరనున్నారు. ఈ నిధుల ద్వారా భక్తులకు మెరుగైన వసతులు కల్పించి, ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌లను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.

బీచ్ పర్యాటకం, అంతర్జాతీయ గుర్తింపు

స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద మచిలీపట్నంలో 'వైబ్రెంట్ బీచ్ ఫ్రంట్ డెవలప్‌మెంట్' కోసం రూ. 120.04 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కోరనున్నారు. అలాగే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి, విశాఖపట్నం నగరాలను 'గ్లోబల్ టూరిజం డెస్టినేషన్లు'గా మార్చే దిశగా కేంద్ర సహకారం కోరనున్నారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా అమరావతిలో 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ' ఏర్పాటుకు మద్దతు తెలపాలని విన్నవించనున్నారు. శీలా భిడే కమిటీ సిఫార్సుల మేరకు అమరావతిలో పర్యాటక భవనం (ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్) నిర్మించేందుకు రూ. 100 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ఆడగనున్నారు..

బౌద్ధ క్షేత్రాలు, సాంస్కృతిక వారసత్వం

ఆంధ్రప్రదేశ్‌లోని బౌద్ధ క్షేత్రాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు రూ. 77.32 కోట్లతో టెంట్ సిటీల అభివృద్ధిని మంత్రి ప్రతిపాదించనున్నారు. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన లంబసింగిలో పర్యాటకుల అనుభూతిని మెరుగుపరిచేందుకు రూ. 99.87 కోట్లు, అలాగే చారిత్రక ప్రాధాన్యత కలిగిన లేపాక్షిలో మౌలిక సదుపాయాల కోసం రూ. 103.05 కోట్లు కోరనున్నారు. ఇక సాంస్కృతిక పరంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సూచించిన 'సూర్యరాయ నిఘంటువు' పునర్ముద్రణ అంశంపై కూడా చర్చించనున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపిన నేపథ్యంలో, పర్యటనలో దీనికి తుది రూపం తీసుకురావాలని మంత్రి దుర్గేష్ భావిస్తున్నారు.

విభజన అనంతరం నవ్యాంధ్ర ఎదుర్కొంటున్న ప్రత్యేక ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర పర్యాటక ప్రాజెక్టులన్నింటినీ ప్రత్యేక ప్రాధాన్యతతో మంజూరు చేయాలని కేంద్రానికి మంత్రి విజ్ఞప్తి చేయనున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టడమే లక్ష్యంగా ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పర్యాటక రంగానికి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే, మరింత సహకారం కోరనున్నారు. మౌలిక సదుపాయాల బలోపేతం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి గుర్తింపు వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు..