
మంత్రి ఇలాఖాలో విచ్చలవిడి అమ్మకాలు
నారా వారి నకిలీ మద్యంతో ..ఏపీ నకిలీ మద్యాంధ్రప్రదేశ్ గా మారిందని పెనుకొండ వైసీపీ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ విమర్శించారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలనిసోమవార పెనుకొండలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద మద్యం సీసాలను పగలగొట్టి నిరసన తెలిపారు. మద్యం షాపుల్లో, బెల్టు షాపుల్లో టీడీపీ వారు నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నకిలీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని విమర్శించారు. ములకలచెరువు కల్తీ మద్యం తయారీ ఘటన టీడీపీ అక్రమాలకు ఉదాహరణగా నిలుస్తోందని ఉషశ్రీ చరణ్ ఆరోపించారు.
ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి సంపాదించిన డబ్బు ..పై నుంచి కింద వరకూ పంచుకుంటున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం వ్యాపారం వ్యవస్థీకృతంగా మారిందన్నారు. కల్తీ మద్యం తయారీపై అనుమానం రాకుండా ఉండటానికి వైసీపీపై లిక్కర్ కేసు పేరుతో విషప్రచారం చేశారని అన్నారు. ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం బాటిల్ అని ఆమె అభిప్రాయపడ్డారు. టీడీపీ వారే తయారు చేసి, వారే అమ్ముతూ, వాటాలు పంచుకుంటున్నారని పేర్కొన్నారు. కాగ్ నివేదిక ప్రకారం టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అమ్మినా మద్యం అమ్మకాల్లో మూడు శాతం వృద్ధి మాత్రమే ఉందని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోందని విమర్శించారు.
సొంత ఆదాయం కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతారా అని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. మంత్రి సవిత సొంతూరు రాంపురంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం తయారీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కల్తీ మద్యం కారణంగా చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ వ్యవహారంలో ఉన్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాల వేళలు తగ్గించాలని కోరారు.
