Let's talk: editor@tmv.in
మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన విరమణ

మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన విరమణ

Dantu Vijaya Lakshmi Prasanna
26 ఫిబ్రవరి, 2026

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల ఆందోళనకు ముగింపు పలికింది. వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించి, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో 6 డిసెంబర్ 2025 నుంచి కొనసాగుతున్న నిరసనకు తెరపడింది.

ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించగా, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆప్కాబ్ ఎండీ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పీఏసీఎస్ ఉద్యోగుల డిమాండ్లను సవివరంగా పరిశీలించిన కమిటీ, ఉద్యోగుల భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేలా నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వం పీఏసీఎస్ ఉద్యోగుల జీతాలకు మొత్తం 20 శాతం పెంపును ఆమోదించింది. అలాగే గ్రాట్యుటీని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ప్రతి ఉద్యోగికి రూ.5 లక్షల కవరేజీతో సమగ్ర గ్రూప్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోజనాల అమలు విధానాలను ఉన్నతస్థాయి కమిటీ త్వరలోనే ప్రకటిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

సహకార బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడంలో పీఏసీఎస్ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పీఏసీఎస్ కంప్యూటరైజేషన్, ఈఆర్పీలో రియల్‌టైమ్ లావాదేవీలు, డైనమిక్ ఈఓడీ ప్రక్రియలు, హెచ్ఆర్ఎంఎస్ ద్వారా జీతాల చెల్లింపు వంటి బాధ్యతలను ఉద్యోగులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని ఆయన ప్రశంసించారు. యూనియన్లకు సంబంధించిన ఇతర డిమాండ్లను కూడా కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుందన్నారు.

ఈ నిర్ణయాల నేపథ్యంలో విజయవాడలో జరిగిన క్యాంప్ ర్యాలీలో పీఏసీఎస్ ఉద్యోగులు మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలసి సత్కరించారు. ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ, ఈ సానుకూల నిర్ణయాలతో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ఉద్యోగులు రైతులకు మరింత ఉత్సాహంతో సేవలందిస్తారని అన్నారు. ఇవి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మిక హిత దృక్పథానికి, మంత్రి అచ్చెన్నాయుడు దూరదృష్టి నాయకత్వానికి నిదర్శనమని పేర్కొంటూ, తక్షణమే ఆందోళన విరమించి సాధారణ విధులకు హాజరవుతామని ఉద్యోగులు ప్రకటించారు.

కాగా,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగులు జీతాలు సంవత్సరాలుగా పెరగకపోవడం, పెరుగుతున్న జీవన వ్యయాలకు తగిన వేతన సవరణ లేకపోవడం, పదవీ విరమణ అనంతర భద్రతకు గ్రాట్యుటీ తక్కువగా ఉండటం, ఉద్యోగులు-వారి కుటుంబాలకు వర్తించే సమగ్ర మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం, స్పష్టమైన హెచ్‌ఆర్ పాలసీ, సేవా భద్రతా నియమాలు అమలులో లేకపోవడం, అలాగే పీఏసీఎస్ కంప్యూటరైజేషన్, ఈఆర్పీ, రియల్‌టైమ్ లావాదేవీలు, ఈఓడీ, హెచ్ఆర్ఎంఎస్ వంటి కీలక డిజిటల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ తగిన గుర్తింపు, ప్రోత్సాహకాలు లేవన్న కారణాలతో 6 డిసెంబర్ 2025 నుంచి ఆందోళన చేపట్టారు.