
మంచు కురవక భదర్వాహ్‌లో వింటర్ టూరిజానికి దెబ్బ
ఈ ఏడాది శీతాకాలంలో మంచు కురవకపోవడం వల్ల జమ్మూ కాశ్మీర్‌లోని డోడా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం భదర్వాహ్ తీవ్రంగా నష్టపోతోంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులు వింటర్ టూరిజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పర్యాటక రంగానికి చెందిన వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా అక్టోబర్ మధ్య నాటికే మంచు పడే గుల్దండా, చట్టర్‌గల్లా, పద్రీ వంటి ఎత్తైన పర్యాటక ప్రాంతాల్లో ఈసారి ఇప్పటివరకు అధికంగా మంచు కురవడం లేదు. దీంతో శీతాకాల పర్యటనలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ పూర్తిగా నిలిచిపోయాయి. మంచు లేకపోవడంతో పర్యాటకులు ఈ ప్రాంతానికి రావడాన్ని తగ్గించుకున్నారు. ఫలితంగా హోటళ్లు, టూరిస్ట్ గైడ్లు, దుకాణదారులు, స్థానిక వ్యాపారుల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది.
పర్యాటకుల రాకలో 80 శాతం తగ్గుదల
భదర్వాహ్–పఠాన్‌కోట్ హైవేపై ఉన్న 9,555 అడుగుల ఎత్తైన గుల్దండా ప్రాంతానికి గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు పర్యాటకుల రాక 80 శాతం తగ్గిందని టూరిజం వ్యూహకర్త రషీద్ చౌదరీ తెలిపారు. ఒకప్పుడు మంచుతో కప్పబడిన అందమైన దృశ్యాలకు నిలయమైన గుల్దండా, ఈసారి మంచు లేకపోవడంతో పర్యాటకులు లేక వెలవెలబోతోంది. దీనివల్ల పర్యాటక రంగంపై ఆధారపడి ఉన్న వర్గాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.
అధికారిక గణాంకాలు
భదర్వాహ్ డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) గణాంకాల ప్రకారం 2022 (అక్టోబర్ 15 – డిసెంబర్ 15) 1.75 లక్షల మంది పర్యటించారు. 2023లో 2 లక్షలు, 2024లో 1.8 లక్షలు, 2025లో కేవలం 10 వేల మంది మాత్రమే ఇప్పటి వరకు సందర్శించారు. ఈ గణాంకాలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.
స్థానికుల ఆవేదన
గుల్దండాలో చిన్న వ్యాపారం నిర్వహిస్తున్న రాజ్ కుమార్ మంహాస్ మాట్లాడుతూ మూడేళ్లుగా ఈ కాలంలో రోజుకు 100–150 వాహనాలు వచ్చేవి. కానీ ఈ ఏడాది రోజుకు 10 వాహనాలు కూడా రావడం లేదు. మంచు కురిస్తేనే మా జీవనం కొనసాగుతుంది. న్యూ ఇయర్‌కు ముందు మంచు పడుతుందని ఒక ఆశ అని అన్నారు.
పర్యాటకుల నిరాశ
ఝార్ఖండ్ నుంచి వచ్చిన పర్యాటకురాలు సునీతా తిర్కే మాట్లాడుతూ మంచును ఆస్వాదించాలనే ఆశతో ఇక్కడికి వచ్చాం. కానీ పచ్చిక మైదానాలు మాత్రమే కనిపించాయి. అందుకే మా పర్యటనను తగ్గించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పర్యాటక రంగానికి చెందిన వర్గాలు క్రిస్మస్, నూతన సంవత్సరం ముందు వచ్చే రెండు వారాల్లో మంచు కురుస్తుందని ఆశిస్తున్నాయి. అదే జరిగితే ఈ సీజన్‌లో కొంతైనా వింటర్ టూరిజం పుంజుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
