Let's talk: editor@tmv.in
మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ కాన్వాయ్‌పై రాళ్లదాడి

మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ కాన్వాయ్‌పై రాళ్లదాడి

Gaddamidi Naveen
18 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మంగళవారం మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై రాళ్లదాడి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్-అఫీషియో సభ్యులుగా పాల్గొనేందుకు మంత్రి వివేక్, ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ జి. వంశీకృష్ణ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. కాన్వాయ్‌ను అడ్డుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు తన వాహనంపై దాడి చేశారని ఆరోపించారు. ట్రాఫిక్ కోన్‌తో దాడి చేయడం వల్ల ఒక పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ కార్యకర్త గాయపడ్డారని పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి హింసకు పాల్పడ్డారని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు భారీగా గుమిగూడి హింసకు ప్రేరేపించారని ఆయన మండిపడ్డారు. వీడియో ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు.

ఇక మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. పోలీసుల లాఠీచార్జ్‌ను ఆయన ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. న్యాయం కోసం నిరసనకు దిగిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పైనే కేసులు బనాయిస్తామని బెదిరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమ‌ని ఆయ‌న తెలిపారు. అటు జనగామలోనూ మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ చేయి ఎత్తిన దళిత మహిళా కౌన్సిలర్‌ పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించడం చాలా దారుణమ‌ని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.