
మంగోలియా కొత్త ప్రధానిగా ఉచ్రాల్ నియామ్-ఓసర్
ఖనిజ సంపదకు నిలయమైన మంగోలియాలో రాజకీయ అస్థిరత ముదురుతోంది. పాలకపక్షమైన 'మంగోలియన్ పీపుల్స్ పార్టీ'లో ముదిరిన అంతర్గత విభేదాల కారణంగా గడిచిన తొమ్మిది నెలల్లోనే ముగ్గురు ప్రధానులు మారారు. తాజా పరిణామాల మధ్య దేశ కొత్త ప్రధానమంత్రిగా 39 ఏళ్ల ఉచ్రాల్ నియామ్-ఓసర్ సోమవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 126 మంది సభ్యులకు గాను 107 మంది హాజరుకాగా, ఆయనకు 88 మంది (82 శాతం) మద్దతు పలికారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న జందన్‌షతర్ గొంబోజావ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ మార్పు అనివార్యమైంది.
హిప్-హాప్ స్టార్ నుంచి ప్రధాని వరకు..
కొత్త ప్రధాని ఉచ్రాల్‌కు ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఆయన 'టిమాన్' పేరుతో ప్రజాదరణ పొందిన హిప్-హాప్ కళాకారుడు. గత నవంబర్‌లో ఆయన పార్లమెంటు స్పీకర్‌గా, పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. గతంలో డిజిటల్ అభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన.. దేశంలో పారదర్శకతను పెంచేందుకు డిజిటల్ పాలనను ప్రోత్సహించారు. ముఖ్యంగా సోవియట్ కాలం నాటి పాత అనుమతుల వ్యవస్థను రద్దు చేసి, అవినీతిని అంతం చేయడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. 2025 ప్రారంభంలో ఫ్రాన్స్‌కు చెందిన ఒరానో గ్రూప్‌తో యురేనియం ఒప్పందంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
అస్థిరతలో ఆర్థిక వ్యవస్థ
బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉచ్రాల్ మాట్లాడుతూ.. దేశం ప్రస్తుతం మూడు ప్రధాన సంక్షోభాలను ఎదుర్కొంటోందని హెచ్చరించారు. పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరలు, అస్థిరంగా ఉన్న ఖనిజ మార్కెట్లు, దేశీయంగా ఉన్న రాజకీయ విభేదాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "సంక్షోభ సమయాల్లో అందరూ ఏకమవ్వాలి కానీ, అంతర్గత పోరాటాలతో ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చకూడదు" అని ఆయన ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. బొగ్గు, రాగి ఎగుమతులపైనే దేశం ఎక్కువగా ఆధారపడటం వల్ల అంతర్జాతీయ ధరల్లో మార్పులు ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
అవినీతి ఆరోపణలు.. సవాళ్ల పరంపర
గత ప్రధాని జందన్‌షతర్ హయాంలో ఒక సీనియర్ మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, విపక్ష డెమొక్రాటిక్ పార్టీ పార్లమెంటును బహిష్కరించడం వంటి పరిణామాలతో పాలన స్తంభించిపోయింది. దీనికి తోడు ఓయు టోల్గోయ్ రాగి-బంగారు గని విషయంలో మైనింగ్ దిగ్గజం 'రియో టింటో'తో జరుగుతున్న చర్చలు, రష్యా నుంచి ఇంధన సరఫరా స్థిరంగా ఉండేలా చూడటం ఉచ్రాల్ ముందున్న తక్షణ సవాళ్లు. తరచూ మారుతున్న విధానాలు, అవినీతి, రాజకీయ అస్థిరత కారణంగా విదేశీ పెట్టుబడిదారులు మంగోలియా వైపు రావడానికి వెనుకాడటం కొత్త ప్రధానిని కలవరపెడుతున్న అంశం.
