Let's talk: editor@tmv.in
మంగళగిరిలో ‘కుంకీ’ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మంగళగిరిలో ‘కుంకీ’ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మంగళగిరిలో ‘కుంకీ’ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Gaddamidi Naveen
25 జులై, 2026

పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు ‘జయంత్’, ‘అభిమన్యు’లకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు. గజరాజులపై పూలు చల్లి ఆహ్వానించిన ఆయన, వాటికి స్వయంగా ఆహారం తినిపించారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి వాటి ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు.

ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన తర్వాత అక్కడి వాతావరణానికి అవి అలవాటుపడేలా నిపుణుల పర్యవేక్షణలో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శాస్త్రీయ, మానవీయ విధానాలతో పనిచేస్తోందని తెలిపారు.

ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి తరచూ ఏనుగుల గుంపులు పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించి పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికే కుంకీలను గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్నారు. గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అడవుల్లోకి మళ్లించడంలో జయంత్, అభిమన్యులు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఈ రెండు కుంకీల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఏనుగుల దాడి నుంచి ప్రజలను ఆదుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.