Let's talk: editor@tmv.in
భోజ్‌శాల వద్ద వసంత పంచమి , నమాజ్‌ చేసుకొవచ్చు: సుప్రీంకోర్టు

భోజ్‌శాల వద్ద వసంత పంచమి , నమాజ్‌ చేసుకొవచ్చు: సుప్రీంకోర్టు

Pinjari Chand
23 జనవరి, 2026

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల–కమాల్ మౌలా మసీదు సముదాయంలో వసంత పంచమి సందర్భంగా హిందువులు, ముస్లింలు తమ తమ మతాచారాలను పాటించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. శుక్రవారం వసంత పంచమి రోజున హిందువులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పూజలు నిర్వహించుకోవచ్చని, అదే రోజున ముస్లింలు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్ చేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నమాజ్‌కు హాజరయ్యే ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తుల జాబితాను జిల్లా యంత్రాంగానికి ముందుగానే అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజలు జరగనున్న నేపథ్యంలో, జనవరి 23న భోజ్‌శాల సముదాయంలో మతాచారాలకు అనుమతి ఇవ్వాలని హిందూ, ముస్లిం సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం (జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీ) ఇరు వర్గాలు పరస్పర గౌరవంతో వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని సూచించింది.

ముస్లిం సమాజానికి చెందిన ఎంత మంది వ్యక్తులు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య నమాజ్‌కు వస్తారో ముందుగా తెలుసుకుని, అదే ప్రాంగణంలో ప్రత్యేకంగా వేరు చేసిన స్థలాన్ని కేటాయించాలి. అదే విధంగా గతంలో అనుసరించిన పద్ధతుల ప్రకారం హిందూ సమాజానికి వసంత పంచమి సందర్భంగా సంప్రదాయ పూజల కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని ధర్మాసనం పేర్కొంది. భోజ్‌శాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. అవసరమైతే సందర్శకులకు ఉచిత పాసులు జారీ చేయడం లేదా ఇతర న్యాయమైన చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచించింది.

2003 నుంచి ఏఎస్ఐ ఆదేశాల అమలు

భోజ్‌శాల 11వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన కట్టడం. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) పరిరక్షణలో ఉంది. హిందువులు దీనిని విద్యాదేవత వాగ్దేవి (సరస్వతి) ఆలయంగా భావిస్తుండగా, ముస్లింలు దీనిని కమాల్ మౌలా మసీదుగా పిలుస్తున్నారు. ఏఎస్‌ఐ 2003 ఏప్రిల్ 7న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, భోజ్‌శాల ప్రాంగణంలో మంగళవారాలు హిందువులు పూజలు చేయడం, శుక్రవారాలు ముస్లింలు నమాజ్ చేయడం కొనసాగుతోంది. వసంత పంచమి రోజున హిందువులకు పూర్తిస్థాయి ప్రత్యేక హక్కులు కల్పించాలని కోరుతూ హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ ద్వారా ఈ పిటిషన్ అత్యవసర విచారణకు మంగళవారం ప్రస్తావించారు. 2003లోని ఏఎస్‌ఐ ఆదేశాలు, వసంత పంచమి శుక్రవారంతో కలిసివచ్చే సందర్భాలను స్పష్టంగా ప్రస్తావించలేదని జైన్ వాదించారు. వసంత పంచమి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పూజలు, హవనాలు జరుగుతాయని, ఆ రోజంతా హిందువులకు అడ్డంకులేని పూజలకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.

భద్రత కట్టుదిట్టం

మసీదు కమిటీ తరఫున సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదిస్తూ, శుక్రవారం నమాజ్ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య జరుగుతుందని, ఆ సమయం పూర్తయ్యాక ప్రాంగణాన్ని ఖాళీ చేస్తామని తెలిపారు. నమాజ్‌కు హాజరయ్యే ముస్లిం భక్తుల అంచనా సంఖ్యను జిల్లా మేజిస్ట్రేట్‌కు అందజేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం, ఏఎస్‌ఐ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ కేఎం నాటరాజ్, శాంతిభద్రతల నిర్వహణను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తుందని కోర్టుకు హామీ ఇచ్చారు.

భోజ్‌శాల సముదాయంపై ‘శాస్త్రీయ సర్వే’కు సంబంధించిన మధ్యప్రదేశ్ హైకోర్టు 2024 మార్చి 11 ఉత్తర్వులను సవాలు చేస్తూ మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏఎస్‌ఐ ఇప్పటికే శాస్త్రీయ సర్వే పూర్తి చేసి, నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించినట్లు కోర్టు గుర్తు చేసింది. ఆ నివేదికను అన్‌సీల్ చేసి పక్షాలకు అందజేయాలని, అవసరమైతే న్యాయవాదుల సమక్షంలో పరిశీలనకు అనుమతించాలని ఆదేశించింది. అభ్యంతరాలు దాఖలు చేసిన అనంతరం తుది విచారణ జరపాలని పేర్కొంది. తుది తీర్పు వెలువడే వరకు భోజ్‌శాల వద్ద ప్రస్తుత స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని, అయితే 2003లో ఏఎస్‌ఐ జారీ చేసిన ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.