Let's talk: editor@tmv.in
భోగాపురం విమానాశ్రయంపై జగన్‌ది క్రెడిట్ చోరీ: మంత్రి పార్థసారధి

భోగాపురం విమానాశ్రయంపై జగన్‌ది క్రెడిట్ చోరీ: మంత్రి పార్థసారధి

Gaddamidi Naveen
30 జులై, 2026

కూటమి ప్రభుత్వంలో తిరుపతి నుంచి అమరావతి, విశాఖ, ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనపై, భోగాపురం విమానాశ్రయం ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడారు.

వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి 10-20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, అసైన్డ్ భూముల (జీఓ-596) పేరుతో వైసీపీ నేతలు 20 వేల ఎకరాలకు పైగా భూములను దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. విశాఖ రుషికొండను తొలిచి రూ. 500 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని, చంద్రబాబు నాయుడు తెచ్చిన ఐటీ కంపెనీలను తరిమేసి ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం చేశారని మండిపడ్డారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రపంచ స్థాయి, అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుంది. జీఎంఆర్ సంస్థ దీనిని అద్భుతంగా నిర్మించిందని, ఇది 'గ్లోబల్ ఆంధ్రాకు గేట్‌వే'గా మారనుందన్నారు. 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో సదుపాయం ఎగుమతులకు ఎంతో ఉపకరిస్తుంది. ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌తో పాటు రూ. 2,388 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ ప్రాజెక్ట్ రాబోతోందని మంత్రి వెల్లడించారు.

భోగాపురం నుంచి విశాఖకు రోడ్డు కనెక్టివిటీ శరవేగంగా పూర్తవుతోందని, శంషాబాద్ విమానాశ్రయంలాగే ఇది ఏపీ ఆదాయానికి ప్రధాన వనరుగా మారుతుందన్నారు. ఇదే వేదికగా రూ. 17,912 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని మంత్రి అన్నారు.

భోగాపురం విమానాశ్రయంపై జగన్ మోహ‌న్ రెడ్డి కనీస కంట్రిబ్యూషన్ లేకుండా 'క్రెడిట్ చోరీ'కి పాల్పడుతున్నారని మంత్రి విమర్శించారు. గతంలో భోగాపురానికి విమానాశ్రయం ఎందుకని మాట్లాడిన జగన్, ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం హాస్యాస్పదమన్నారు. వైసీపీ నేతలు నేరస్థులకు, హంతకులకు అండగా నిలుస్తూ కుల, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఓపెన్ డిబేట్‌కు రావాలని ధర్మాన ప్రసాదరావు, ఇతర వైసీపీ నేతలకు మంత్రి సవాల్ విసిరారు.

ట్యాగ్‌లు
BhogapuramAirportNorthAndhraUttarandhraAndhraPradeshAPDevelopmentPMModiNChandrababuNaiduGreenfieldAirport
భోగాపురం విమానాశ్రయంపై జగన్‌ది క్రెడిట్ చోరీ: మంత్రి పార్థసారధి - Tholi Paluku