Let's talk: editor@tmv.in
భోగాపురం విమానాశ్రయంపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: వైఎస్ జగన్

భోగాపురం విమానాశ్రయంపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: వైఎస్ జగన్

Gaddamidi Naveen
30 జులై, 2026

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన క్రెడిట్‌ను తమ ప్రభుత్వం నుంచి దూరం చేసి ప్రస్తుత ప్రభుత్వం సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. "పని వైఎస్సార్‌సీపీది... ప్రచారం చంద్రబాబుది" అంటూ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వరుస పోస్టులు చేశారు. "క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్" అనేదే చంద్రబాబు మార్కు రాజకీయమని విమర్శించారు.

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఉత్తరాంధ్ర ప్రజలకు సంతోషకరమైన విషయమని జగన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం వల్ల భోగాపురానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, దీంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభిస్తుందని అన్నారు.

అయితే విమానాశ్రయం నిర్మాణంలో తమ ప్రభుత్వం చేసిన కృషిని విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు ఒక శంకుస్థాపన రాయి వేయడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి పురోగతి సాధించలేదని విమర్శించారు.

2020 జూన్‌లో జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకోవడం నుంచి భూసేకరణ, పునరావాసం (ఆర్ అండ్ ఆర్), స్థల పరిశుభ్రత, వివిధ శాఖల అనుమతులు, భద్రతా క్లియరెన్స్‌లు, నీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఏరోనాటికల్ సేవలు, ఆర్థిక సమీకరణ వంటి కీలక ప్రక్రియలన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన భూసేకరణను తాము పూర్తి చేసి, నాలుగు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించామని చెప్పారు.

భూసేకరణ, పునరావాసం కోసం రూ.967 కోట్లు, నీటి సరఫరా కోసం రూ.75 కోట్లు, మౌలిక వసతుల కోసం రూ.134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రహదారుల కోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు వెచ్చించి మొత్తం రూ.1,200 కోట్లకు పైగా ఖర్చు చేశామని జగన్ వెల్లడించారు. కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పనులను ముందుకు తీసుకెళ్లి, 2024 ఎన్నికల నాటికి రన్‌వేను కీలక దశకు తీసుకురావడంతో పాటు టెర్మినల్ నిర్మాణాన్ని వేగవంతం చేశామని పేర్కొన్నారు.

అంతేకాకుండా, 2026 జూన్ నాటికే భోగాపురం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించామని గుర్తు చేశారు. ప్రస్తుతం విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలే కారణమని తెలిపారు.

అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో కూటమి ప్రభుత్వం విఫలం

విశాఖపట్నం నగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంపై సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి రూ. 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లైన్ల హైవే మంజూరు చేయించామని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ రెండేళ్లయినా ఆ రోడ్డు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ఇతరుల కష్టాన్ని తన ఖాతాలో వేసుకునే వైఖరిని ఇకనైనా మానాలని జగన్ హితవు పలికారు.

ట్యాగ్‌లు
BhogapuramAirportBhogapuramAlluriSitaramaRajuAirportYSJaganJaganMohanReddyChandrababuNaiduAndhraPradeshAPPoliticsTeluguNewsBreakingNewsVizagNorthAndhra
భోగాపురం విమానాశ్రయంపై చంద్రబాబు క్రెడిట్ చోరీ: వైఎస్ జగన్ - Tholi Paluku