
భోగాపురం వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ విజయవంతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విమానయాన చరిత్రలో మరో కీలక అంకం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంలో ఆదివారం వాలిడేషన్ ఫ్లైట్ (ప్రయోగాత్మక విమానం) ల్యాండింగ్ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ ఇది కేవలం ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదని, ఈ ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక మలుపు అని అభివర్ణించారు.
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పర్యవేక్షించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. గతంలో అమల్లో ఉన్న 150 కిలోమీటర్ల పరిధిలో నిబంధన కేంద్రం సడలింపులు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నడుస్తున్న విమానాశ్రయం తన సామర్థ్యానికి మించి రద్దీని ఎదుర్కొంటున్నప్పుడు సమీపంలోనే మరో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించుకోవడానికి ఇకపై ఎలాంటి సాంకేతిక అడ్డంకులు ఉండవు. దీనివల్ల మెట్రో నగరాల్లో రెండో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్రాలకు మార్గం సుగమమైంది అని ఆయన వివరించారు. ఇక ఈ నిబంధన సడలింపుతో అమరావతిలో రాబోయే కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా ప్రపంచ స్థాయి సాంకేతికతతో నిర్మించబోతున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు భోగాపురం గగనతాన తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. 2014-19 మధ్య ఎన్డీయే హయాంలోనే ఈ ప్రాజెక్టుకు పునాది పడిందని గడిచిన 18 నెలల్లో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ అందించిన ప్రోత్సాహం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. జూన్ నాటికి ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని, ప్రధాని మోదీ చేతుల మీదుగానే దీనిని ప్రారంభిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు ధృవీకరించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు వచ్చినట్లు అయిందని, ఇది ఈ ప్రాంత అభివృద్ధికి ఒక 'గేమ్ ఛేంజర్' అని పేర్కొన్నారు.
జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు పెద్దపీట
దేశవ్యాప్తంగా విమానయాన రంగాన్ని విస్తరిస్తున్నామని చెబుతూ, నోయిడాలోని జేవర్ విమానాశ్రయం ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు. భారత్‌లో విమానాల సంఖ్యను చైనా స్థాయిలో (దాదాపు 4,000) పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిదంగా ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ఘటనపై అంతర్జాతీయ ప్రమాణాల మేరకు విచారణ జరుగుతోందని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భోగాపురం రాకతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక విప్లవం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ, విజన్ విశాఖకు ఇది కీలక మైలురాయి అని అభివర్ణించారు. తమ ప్రభుత్వ హయాంలో భూసేకరణ, పునరావాసం కోసం రూ.960 కోట్లు ఖర్చు చేసి పటిష్టమైన పునాది వేశామని వేగవంతమైన అనుమతులతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన జిఎంఆర్ గ్రూపునకు ఆయన అభినందనలు తెలిపారు.
