
భోగాపురం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో తొలి వాణిజ్య విమానం విమానాశ్రయంలో దిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తొలి వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించి ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఎంతో సంతోషం, గర్వంగా ఉందన్నారు. ఉత్తరాంధ్రకు ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, ఈ ప్రాంతానికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని పేర్కొన్నారు.
విమానాశ్రయంలోని మౌలిక వసతులు, నిర్మాణ శైలి, సౌకర్యాలను ప్రయాణికులు ప్రశంసించారని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ విమానాశ్రయాన్ని కేవలం ఒక భవనంగా కాకుండా ఉత్తరాంధ్ర చరిత్ర, వారసత్వం, సంస్కృతికి ప్రతీకగా నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు, విమానాశ్రయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జీఎంఆర్ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. గతంలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
విశాఖకు ప్రత్యామ్నాయంగా భోగాపురం
విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సర్వీసులు నిలిచిపోవడంపై ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకున్నానని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే అక్కడి మౌలిక వసతులను ప్రైవేట్ విమానాల కోసం జనరల్ ఏవియేషన్ కింద వినియోగిస్తున్నట్లు చెప్పారు. భోగాపురం విమానాశ్రయానికి రహదారి అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పలు రహదారులను విస్తరిస్తుండగా.. సొంత్యం రహదారితో సహా ఏడు ప్రధాన రహదారి ప్రాజెక్టులను చేపట్టినట్లు వెల్లడించారు. విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి సముద్రతీరం వెంబడి మరో మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి బీచ్ కారిడార్‌కు కూడా అనుమతి లభించిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కొత్త విమానాశ్రయంలో ప్రారంభ దశలో కొంత అసౌకర్యం ఉండొచ్చని, అయితే ప్రయాణికులు విమానాశ్రయాన్ని సందర్శించి సౌకర్యాలను అనుభవించిన తర్వాత గర్వపడతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సోమవారం హైదరాబాద్ నుంచి ఇండిగో తొలి విమానం రాగా.. అనంతరం బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం చేరుకుంది.
విశాఖ నుంచి చివరి సర్వీస్
ఇదిలా ఉండగా, విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సర్వీసులు ఆగస్టు 16తో నిలిచిపోయాయి. చివరి విమానం ఇండిగో 6ఈ 2018 రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది.
