Let's talk: editor@tmv.in
భూ సర్వే పేరిట క్రెడిట్‌ చోరీ చేస్తున్నారు : వైఎస్‌ జగన్‌

భూ సర్వే పేరిట క్రెడిట్‌ చోరీ చేస్తున్నారు : వైఎస్‌ జగన్‌

Panthagani Anusha
23 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్‌లో తమ హయాంలో చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుల ప్రయోజనాల కోసం చేపట్టిన మహాయజ్ఞాన్ని వక్రీకరిస్తూ ‘క్రెడిట్‌ చోరీ’కి పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్‌ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

భూమండలంపై క్రెడిట్‌ చోరీ చేయగలిగిన వ్యక్తి చంద్రబాబే

‘‘ఈ భూమండలంపై క్రెడిట్‌ చోరీ అత్యంత సమర్థంగా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఆయనను చూసి సిగ్గుపడాలి’’ అని జగన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నరగా అధికారంలో ఉన్నా రైతు సమస్యల పరిష్కారంపై చంద్రబాబుకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని 2019–2024 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన భూ రీసర్వేను తనదిగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

పాదయాత్రలో పుట్టిన ఆలోచన

భూ రీసర్వే ఆలోచన తన పాదయాత్ర సమయంలోనే రూపుదిద్దుకుందని జగన్‌ గుర్తు చేస్తూ రైతులు ఎదుర్కొంటున్న అనేక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అవసరమని అప్పుడు అర్థమైంది. రాష్ట్రంలో సర్వేయర్లు లేరు ఆధునిక సాంకేతికత లేదు. అయినా సరే అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేస్తానని 2019 మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 2020 డిసెంబర్‌ 21న ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించాం అని తెలిపారు.

వందేళ్ల తర్వాత జరిగిన మహాయజ్ఞం

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలన కాలంలో జరిగిన సర్వే తర్వాత రాష్ట్రంలో ఇంత విస్తృత స్థాయిలో భూ రీసర్వే జరగడం ఇదే తొలిసారి అని జగన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర భూ రీసర్వే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమం. వివాదాలు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఈ సర్వే జరిగింది. ఎవరూ మార్చలేని విధంగా భూ రికార్డులు సిద్ధం చేశాం. భూ యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు అందించాం. ప్రభుత్వమే సాక్ష్యం అని స్పష్టం చేశారు.

అత్యాధునిక సాంకేతికత వినియోగం

‘ సర్వే ఆఫ్‌ ఇండియా’తో ఒప్పందం చేసుకుని సుమారు 40 వేల మంది సిబ్బందిని నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని హెలికాప్టర్లు, డ్రోన్లతో సర్వే నిర్వహించామని 5 సెంటీమీటర్ల తేడా లేకుండా కొలతలు వేశామని చెప్పారు. అదేవిదంగా రైతులకు ఉచితంగా కోట్లాది సర్వే రాళ్లు పంపిణీ చేసి వాటిపై ‘భూసర్వే–భూరక్ష’ అని లిఖించామని గుర్తు చేశారు.

పట్టాదారు పాస్‌బుక్స్‌లో క్యూఆర్‌ కోడ్‌ వంటి ఆధునిక ఫీచర్లు పొందుపరిచి ట్యాంపర్‌ చేయలేని రికార్డులు రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చయినా వెనుకాడలేదని, ఈ కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్లాటినమ్‌ గ్రేడ్‌ ఇచ్చి రూ.400 కోట్ల రాయితీ ప్రకటించిందని గుర్తు చేశారు. 2023 డిసెంబర్‌లో పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించిందని తెలిపారు.

లక్షల మందికి శాశ్వత హక్కులు

35.40 లక్షల ఎకరాలపై 20.24 లక్షల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించామని 27.40 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములపై హక్కులు ఇచ్చామని జగన్‌ వివరించారు. చుక్కల భూములు, ఇనాం భూముల సమస్యలను పరిష్కరించి లక్షా 60 వేల మందికి హక్కులు కల్పించామని 1.54 లక్షల మంది ఆదివాసీలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కులు ఇచ్చామని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు

ప్రస్తుత కూటమి ప్రభుత్వం సర్వే రాళ్లు తొలగించి పేర్లు మార్చడానికే రూ.15 కోట్లు ఖర్చు చేస్తోందని జగన్‌ ఆరోపించారు. ‘‘మేం రూ.55.79కే పట్టాదారు పాస్‌బుక్ ఇచ్చాం. ఇప్పుడు రూ.76 వసూలు చేస్తున్నారు. కమీషన్ల కోసమే పాస్‌బుక్స్ ఇస్తున్నారు. 22ఏ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టిన చరిత్ర ఆయనదే అని విమర్శించారు.

పల్నాడు ఘటనపై ఆగ్రహం

పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో దళిత యువకుడు సాల్మన్‌ హత్య ఘటనపై జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరమైన రక్షణ లేకుండా ప్రజలు ఊర్లు విడిచే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. ఈ ఘటనలో సీఐ, ఎస్సై నుంచి ఎమ్మెల్యే, సీఎం వరకూ బాధ్యత వహించాలి అని పేర్కొన్నారు. ఈ అంశంపై కోర్టులు, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని తెలిపారు.

నిజాలు దాచలేరు

భూ రీసర్వే విషయంలో నిజాలను ఎంతకాలం దాచలేరని జగన్‌ స్పష్టం చేశారు. ‘‘మేం ఒక బృహత్తర లక్ష్యంతో ప్రారంభించిన భూ రీసర్వేను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అయినా సరే ఈ మహాయజ్ఞం చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుంది అని ధీమా వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి జి. రవికుమార్ జగన్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు. జగన్‌కు క్రెడిట్ తీసుకునే అర్హత ఏమిటని ప్రశ్నించారు. మీరు ఐదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండి. రాష్ట్రాన్ని నాశనం చేసినదే మీకున్న ఏకైక క్రెడిట్ అంటూ ఆయన విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు.