

భూ వివాదాలకు చెక్.. ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ పైలట్‌కు సీఎం చంద్రబాబు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డులను పూర్తిగా పారదర్శకంగా, భద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. భూ రికార్డుల్లో మార్పులు, డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ పత్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూపొందించిన ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా భూ రికార్డులను ఎలా భద్రపరుస్తారో వివరిస్తూ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, సీఎస్ సాయి ప్రసాద్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
భూ రికార్డులకు శాశ్వత భద్రత
భూమికి సంబంధించిన ప్రతి రికార్డును ట్యాంపర్-ప్రూఫ్ విధానంలో భద్రపరిచేలా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రతి భూ పార్సెల్‌కు ప్రత్యేక డిజిటల్ ఐడీ కేటాయించి, భూమి యాజమాన్యం, సర్వే వివరాలు, రిజిస్ట్రేషన్ సమాచారం అన్నీ ఒకే డిజిటల్ వేదికలో అందుబాటులో ఉండేలా ఈ వ్యవస్థ రూపొందించారు.
దీంతో భూ రికార్డులను అక్రమంగా మార్చడం, నకిలీ పత్రాలు సృష్టించడం, ఒకే భూమిని రెండుసార్లు విక్రయించడం వంటి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని అధికారులు తెలిపారు.
రెవెన్యూ- సర్వే- రిజిస్ట్రేషన్ శాఖలు ఒకే వేదికపై
ప్రస్తుతం వేర్వేరు శాఖల్లో ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారం పరస్పరం అనుసంధానమై ఉండటంతో భూముల కొనుగోలు, విక్రయాలు మరింత వేగంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది.
ఈ వ్యవస్థను ఎన్‌ఐసీ ఆంధ్రప్రదేశ్, ఎన్‌ఐసీ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంయుక్తంగా హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేశాయి.
ఏడు జిల్లాల్లో పైలట్ అమలు
ప్రారంభ దశలో ఈ ప్రాజెక్టును రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని ఒక్కో మండలంలో అమలు చేస్తున్నారు.
పైలట్ అమలయ్యే మండలాలు
• కర్నూలు జిల్లా – ఆస్పరి
• చిత్తూరు జిల్లా – పెనుమూరు
• బాపట్ల జిల్లా – రేపల్లె
• కృష్ణా జిల్లా – గన్నవరం
• తూర్పు గోదావరి జిల్లా – కడియం
• పార్వతీపురం మన్యం జిల్లా – గుమ్మలక్ష్మీపురం
• విజయనగరం జిల్లా – కొత్తవలస
ఈ పైలట్ ద్వారా 89 రీ-సర్వే గ్రామాల్లోని 1,37,763 భూ పార్సెల్ మ్యాప్‌లు బ్లాక్‌చెయిన్ వ్యవస్థలోకి తీసుకురానున్నారు.
భూ మోసాలకు అడ్డుకట్ట
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల విలువైన భూముల విషయంలో అనేక మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో భూ వివాదాలు తక్కువగా ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ విధానాల కారణంగా భూ తగాదాలు పెరిగాయని విమర్శించారు.
ప్రత్యేకంగా 22ఏ నిబంధనను కక్షసాధింపు కోసం ఉపయోగించారని, దాని వల్ల అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై దృష్టి పెట్టి భూ సమస్యలను పరిష్కరిస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వేలు నిర్వహిస్తూ రికార్డులను శుద్ధి చేస్తున్నామని, పట్టాదార్ పాస్ పుస్తకాలను అధికారిక ధ్రువీకరణతో అందజేస్తున్నామని చెప్పారు.
శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించి రైతులకు విము క్తి కల్పించామని గుర్తుచేశారు.
రెండు నెలల పాటు అధ్యయనం
బ్లాక్‌చెయిన్ పైలట్ ప్రాజెక్టును రెండు నెలల పాటు సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అమల్లో ఎదురయ్యే సమస్యలను నమోదు చేసేందుకు ప్రత్యేక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని చెప్పారు.
నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు
సర్వే పూర్తయిన గ్రామాలన్నింటినీ దశలవారీగా బ్లాక్‌చెయిన్ వ్యవస్థలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నవంబర్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను నిర్దేశించారు.
భూ సమస్యలకు శాశ్వత ఫుల్‌స్టాప్ పెట్టేలా రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాలను తగ్గించి ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
