
‘భూ భారతి’ పోర్టల్ ద్వారా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలు ఏకీకృతం: మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాకేంద్రిత సేవల లక్ష్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే శాఖలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువస్తూ ‘భూ భారతి పోర్టల్’తో సమగ్రంగా అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ అప్‌గ్రేడ్ చేసిన సమగ్ర వ్యవస్థను జనవరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మంత్రి నాంపల్లిలోని సీసీఎల్‌ఏ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, కార్యాలయాన్ని కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో ఆధునీకరించడంతో పాటు, ప్రజలకు కనిపించే విధంగా స్పష్టమైన మార్పులు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
భూ భారతి పోర్టల్ ద్వారా రైతులు, పౌరులు ఒక్క క్లిక్‌తో తమ భూమికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందగలుగుతారు. ఇందులో భూమి రిజిస్ట్రేషన్ వివరాలు, మ్యూటేషన్ స్థితి, మార్కెట్ విలువ, ఆర్‌ఓఆర్, గ్రామం–సర్వే మ్యాపులు, నాలా ఆర్డర్లు, ఫీడ్‌బ్యాక్ వంటి అంశాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ లాగిన్ ద్వారా ఈ సేవలన్నీ పొందే అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక డిజిటల్ మ్యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయాలకు ఏకరీతి మోడల్ డిజైన్లు రూపొందించాలని మంత్రి సూచించారు. దీని ద్వారా కార్యాలయాల రూపురేఖల్లో ఒకే విధమైన ప్రమాణాలు అమలవుతాయని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ల ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, సీసీఎల్‌ఏ ఇన్‌చార్జ్ కార్యదర్శి మంద మకరంద్ తదితరులు పాల్గొన్నారు. భూ పరిపాలనలో డిజిటల్ విప్లవానికి ఇది కీలక అడుగుగా మంత్రి పేర్కొన్నారు.
