
భూ కుంభకోణం కేసులో షేక్ హసీనాకు ఐదేళ్ల జైలు శిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు, ఆమె కుటుంబ సభ్యులకు ఆ దేశ కోర్టులు వరుసగా జైలు శిక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఒక భూ కుంభకోణం కేసులో ఢాకా కోర్టు సోమవారం హసీనాను దోషిగా తేల్చి, 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఢాకాలోని స్పెషల్ జడ్జి-4 రబియుల్ ఆలం సోమవారం ఈ తీర్పును ప్రకటించారు. ఈ కేసులో హసీనాతో సహా మొత్తం 17 మందికి శిక్షలు పడ్డాయి. షేక్ హసీనాకు ఐదేళ్లు, ఆమె సోదరి షేక్ రెహానాకు ఏడేళ్లు, రెహానా కుమార్తె, బ్రిటీష్ ఎంపీ అయిన ట్యూలిప్ సిద్ధిక్‌కు 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మిగిలిన 14 మంది దోషులకు కూడా ఒక్కొక్కరికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ 17 మంది దోషులు ఒక్కొక్కరు 1 లక్ష టాకాలు జరిమానా కట్టాలని లేదంటే అదనంగా మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా కోర్టు వర్గాలు తెలిపాయి. 78 ఏళ్ల హసీనాపై అవినీతి నిరోధక కమిషన్ (ఏసీసీ) నమోదు చేసిన కేసుల్లో ఇది నాల్గవ తీర్పు కావడం గమనార్హం.
అసలు కేసు ఏమిటి?
బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్, ఢాకా సమీపంలో ఉన్న పూర్బాచల్ న్యూ టౌన్ అనే గృహనిర్మాణ ప్రాజెక్టు కింద ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గత జనవరిలో హసీనా, ఆమె కుటుంబ సభ్యులపై ఆరు వేర్వేరు కేసులు నమోదు చేసింది. ఏసీసీ ఆరోపణల ప్రకారం, మాజీ ప్రధాని హసీనా, ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ రాజ్‌యుక్ లోని సీనియర్ అధికారులతో కలిసి కుమ్మక్కై, నిబంధనలను అతిక్రమించి ఆరు ప్లాట్లను (ఒక్కో ప్లాట్ 7,200 చదరపు అడుగులు) అక్రమంగా పొందారు. ఈ ప్లాట్లను ఆమె తనతో పాటు, కుమారుడు సాజీబ్ వాజేద్ జాయ్, కుమార్తె సైమా వాజేద్ పుతుల్, సోదరి రెహానా, మేనకోడలు సిద్ధిక్‌లకు కేటాయించుకున్నారు.
ఈ భూ కుంభకోణానికి సంబంధించిన మూడు కేసుల్లో గత నవంబర్ 27న ఢాకా కోర్టు షేక్ హసీనాకు మొత్తం 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష (ఒక్కో కేసులో 7 సంవత్సరాల చొప్పున) విధించింది. ఆ కేసుల్లో హసీనాతో పాటు నిందితులుగా ఉన్న ఆమె కుమారుడు జాయ్, కుమార్తె పుతుల్‌కు కూడా ఒక్కొక్కరికి 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది.
ఇప్పటికే బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గత నెలలో షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. గత ఏడాది జులైలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణిచివేసే ప్రయత్నంలో ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నందున, విచారణలో వారి తరఫున ఏ న్యాయవాది కూడా హాజరు కాలేదు.
ప్రస్తుతం 78 ఏళ్ల షేక్ హసీనా తన ప్రభుత్వాన్ని కూలదోసిన పెద్ద ఎత్తున జరిగిన నిరసనల తర్వాత గత సంవత్సరం ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుండి పారిపోయి భారత్‌లో తలదాచుకుంటున్నారు. కోర్టు ఆమెను ఇప్పటికే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటించింది. అయితే ఆమె తనపై ఉన్న అభియోగాలన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా తోసిపుచ్చారు.
భారత్‌కు అప్పగింత అభ్యర్థన
మరణశిక్ష పడిన నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాను తమకు అప్పగించాలని కోరుతూ భారతదేశ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ఢాకా నుండి ఈ అభ్యర్థన తమకు అధికారికంగా అందిందని ఆయన ధృవీకరించారు. ప్రస్తుతం ఈ అభ్యర్థనను భారత ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. పొరుగు దేశంగా భారత్, బంగ్లాదేశ్ స్థిరత్వం, శాంతి, ప్రజాస్వామ్యం, ఆ దేశ ప్రజల శ్రేయస్సు కు కట్టుబడి ఉందని జైస్వాల్ స్పష్టం చేశారు.
